మీ అక్కాచెల్లెళ్లనూ ఇలాగే చేస్తారా?: పవన్ ఫ్యాన్స్ పై నటి అలేఖ్యా ఏంజెల్ ఆగ్రహం!

ఏడాదిన్నర క్రితం దిగిన సెల్ఫీ ఫొటో వైరల్
జగన్ కు, నటికి సంబంధముందని వదంతులు
ఖండించిన అలేఖ్యా ఏంజెల్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తో దాదాపు ఏడాదిన్నర క్రితం ఓ ఆడియో సీడీ ఆవిష్కరణ సందర్భంగా దిగిన ఫొటోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పై నటి అలేఖ్యా ఏంజల్ మండిపడింది. ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్టును పెడుతూ, తనలోని ఆవేదనను వ్యక్తం చేసింది.

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ చేసిన పని చాలా ఘోరమైన పాపమని, ఇదే పనిని మీ అక్క లేదా చెల్లెలు ఇమేజ్ పెట్టి, ఇలాంటి ప్రచారమే చేస్తే ఎంత బాధగా ఉంటుందో ఊహించుకోవాలని మండిపడింది. ఓ అమాయకురాలైన అమ్మాయిపై, మరొకరి కూతురిపై, ఇంకొకరి సోదరిపై ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేసి మనస్తాపానికి గురిచేయడం సరైనదేనా? అని ఆలోచించుకోవాలని హితవు పలికింది.”ఇల్లేమో దూరం… అసలే చీకటి గాడాంధకారం… దారి అంతా గతుకులు… చేతిలో దీపం లేదు కానీ, గుండెల నిండా ధైర్యం ఉంది. నేనెప్పుడైనా ఒత్తిడికి లోనైనప్పుడు ఈ మాటలనే గుర్తు చేసుకుంటాను. ఇవి నన్ను చాలా ప్రభావితం చేస్తాయి. అందుకే, మీరు ఇంత దారుణంగా ట్రోల్ చేస్తున్నా ధైర్యంగా ఉన్నా.. ఉండగలిగా” అని అలేఖ్యా ఏంజెల్ వ్యాఖ్యానించింది.

కాగా, ఓ క్రైస్తవ భక్తిగీతాల సీడీని జగన్ గత సంవత్సరం తన లోటస్ పాండ్ నివాసంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి అలేఖ్య తన కుటుంబ సభ్యులతో సహా హాజరై సెల్ఫీ దిగి, అప్పట్లోనే తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేసుకుని సంబరపడింది. ఇటీవల పవన్ కల్యాణ్ వైవాహిక జీవితం గురించి జగన్ వ్యక్తిగత వ్యాఖ్యలు చేసిన తరువాత, పవన్ ఫ్యాన్స్ గత సంవత్సరం ఫిబ్రవరి 18న తీసిన ఈ ఫొటోను తెరపైకి తెచ్చి, జగన్ కు, నటికి సంబంధముందని ప్రచారం చేసిన సంగతి తెలిసిందే.