‘మీకు డబ్బులెక్కడి నుంచి వస్తున్నాయ్‌?’

ముంబయి: సెల్రబిటీలపై సోషల్‌మీడియాలో కామెంట్లు పెడుతూ కించపరిచే ఘటనలు ఈ మధ్య ఎక్కువవుతున్నాయి. అందులోనూ బాలీవుడ్‌ నటుడు అభిషేక్‌ బచ్చన్‌ ఇలాంటి అనుభవాలు చాలానే ఎదుర్కొన్నారు. అయినా వారిని కసురుకోకుండా దీటుగా సమాధానాలు చెబుతున్నారు. తాజాగా ఓ నెటిజన్‌ నుంచి అభిషేక్‌కు మరో చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల అభిషేక్‌ తన సతీమణి ఐశ్వర్య, కుమార్తె ఆరాధ్యతో కలిసి విహారయాత్ర నిమిత్తం పారిస్‌ వెళ్లి వచ్చారు. మరోపక్క అభిషేక్‌కు దాదాపు మూడేళ్లుగా సినిమాల్లేవు. 2016లో వచ్చిన ‘హౌస్‌ఫుల్‌ 3’ చిత్రంలో నటించారు కానీ అందులో ఆయన ముగ్గురు కథానాయకుల్లో ఒకరిగా కన్పించారు. దీని గురించి రవి పురోహిత్‌ అనే నెటిజన్‌ ప్రస్తావిస్తూ అభిపై ట్విటర్‌లో కామెంట్‌ చేశాడు.

‘గత మూడేళ్లుగా మీకు సినిమాలు లేవు. మరి విహారయాత్రలకు వెళ్లడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి?’ అని ప్రశ్నించాడు. దీనికి అభిషేక్‌ దీటుగా సమాధానమిచ్చారు. ‘ఎందుకంటే సర్‌.. నేను సినిమాల్లో నటించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరిస్తుంటాను. ఇతర వ్యాపారాలు కూడా చేస్తుంటాను. వాటిలో క్రీడలు ఒకటి’ అని సమాధానమిచ్చారు. నెటిజన్ల నుంచి అభి ఇలాంటి కామెంట్లు ఎదుర్కోవడం ఇది కొత్తేం కాదు. కొన్ని రోజుల క్రితం అభిని ఉద్దేశిస్తూ ఓ నెటిజన్‌ అమర్యాదకరంగా ట్వీట్‌ పెట్టాడు. ప్రముఖ క్రికెటర్‌ స్టువర్ట్‌ బిన్నీతో అభిషేక్‌ను పోలుస్తూ..ఇద్దరూ వారి తండ్రుల స్టార్‌డమ్‌తో ఎదుగుతున్నారని, ఎందుకూ పనికిరాని వారైనా అందమైన భార్యలు దొరికారని కామెంట్‌ చేశాడు. దీనికి కూడా అభి వెంటనే స్పందించడంతో సదరు నెటిజన్‌ భయపడి క్షమాపణలు చెప్పాడు.

ప్రస్తుతం అభిషేక్‌ ‘మన్మర్జియా’ అనే చిత్రంలో నటిస్తున్నారు. అనురాగ్‌ కశ్యప్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. విక్కీ కౌశల్‌ మరో కథానాయకుడిగా నటిస్తున్నారు. తాప్సి కథానాయిక. సెప్టెంబర్ 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.‌