మాజీ చీఫ్ జస్టిస్ ఆర్ఎం లోధాకు రూ. లక్ష టోకరా వేసిన ఘనులు!

ఆన్ లైన్ మోసగాళ్ల బారినపడి డబ్బును పోగొట్టుకున్న వారి జాబితాలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎం లోధా కూడా చేరిపోయారు. సైబర్ నేరగాళ్లు వేసిన వలలో చిక్కుకుని లక్ష రూపాయలు పోగొట్టుకున్నారు. ఆర్ఎం లోధా ఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు, ఆయన ఫ్రెండ్స్‌ లిస్ట్ లోని జస్టిస్‌ బీసీ సింగ్‌ ఈ – మెయిల్‌ ఖాతాను హ్యాక్‌ చేసి, బీసీ సింగ్ రాసినట్టుగా మెయిల్ పంపి మోసం చేశారు.

ఏప్రిల్ 19న తనకు బీపీ సింగ్ ఐడీ నుంచి ఓ మెయిల్ వచ్చిందని, తన సోదరుడి చికిత్స కోసం లక్ష రూపాయలు కావాలన్నది దానిలోని సారాంశమని చెప్పారు. డబ్బిచ్చే విషయంలో ఫోన్ చేయగా, ఆయన లిఫ్ట్ చేయలేదని, దీంతో ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఉన్నారని భావించి, వెంటనే ఆయన కోరిన లక్ష రూపాయలను ఆన్‌ లైన్‌ ద్వారా రెండు విడతల్లో పంపించానని జస్టిస్‌ లోధా తన ఫిర్యాదులో వెల్లడించారు.

తన ఈ-మెయిల్ ఎకౌంట్ హ్యాక్ అయిందని, దాన్నుంచి లోధాకు మెసేజ్ వెళ్లగా ఆయన నష్టపోయారని గుర్తించిన బీపీ సింగ్, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. దీంతో జస్టిస్ లోధా ఫిర్యాదు చేయగా, చీటింగ్‌, ఐటీ చట్టాల కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.