మళ్లీ ఎన్నికలకు సిద్ధమేనా? దేవెగౌడకు యడ్యూరప్ప సవాల్‌

‘మెజారిటీ రాకుంటే ఇతర పక్షాలతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోం. తిరిగి ప్రజా తీర్పు కోరతామని చెప్పిన మీరు ఇప్పుడు విధానసభను రద్దు చేసి తిరిగి ఎన్నికలకు సిద్ధం కావాలి’ అని మాజీ ప్రధాని, దళపతి దేవెగౌడకు మాజీ ముఖ్యమంత్రి, భాజపా కర్ణాటకశాఖ అధ్యక్షుడు యడ్యూరప్ప బుధవారం సవాలు విసిరారు. కాంగ్రెస్‌- దళ్‌ సంకీర్ణ సర్కారు ఏర్పాటుకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా భాజపా బుధవారం నిరసన ప్రదర్శనల్ని నిర్వహించింది. ఈ సందర్భంగా బెంగళూరులోని గాంధీ ప్రతిమవద్ద నల్ల పట్టీల్ని ధరించి యడ్యూరప్ప తదితరులు ప్రదర్శనలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘అధికారం కోసం అపవిత్ర పొత్తుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇది పచ్చి అవకాశవాదం’ అని ధ్వజమెత్తారు.

ముఖ్యమంత్రిగా బాధ్యతల్ని చేపట్టిన 24 గంటల్లోగా రైతుల రుణాల్ని మాఫీ చేస్తామని ఇచ్చిన హామీని కుమారస్వామి నిలబెట్టుకోవాలని యడ్యూరప్ప డిమాండు చేశారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన సాగిస్తామని హెచ్చరించారు. ‘రాష్ట్రంలో కాంగ్రెస్‌ చిరునామా గల్లంతైంది. సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైకమాండ్‌కు కప్పాన్ని చెల్లించేవారు. అందువల్లే ఆయనకు ఎనలేని ప్రాధాన్యమిచ్చారు. ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన చర్చలకు ఆయనను దూరం చేశారు. ఆ రకంగా సిద్ధరామయ్యను అవమానించారు. ఇలాంటి పరిస్థితిలో రాజకీయాల్లో ఉండటం ఎలాగో ఆయనే నిర్ణయించుకోవాలి’ అని పేర్కొన్నారు.