మరి అమరావతిలో కూడా తెలంగాణ వార్తలు వేయాలి కదా?: కేటీఆర్

మరి అమరావతిలో కూడా తెలంగాణ వార్తలు వేయాలి కదా?: కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏపీకి చెందిన కొన్ని మీడియా సంస్థలు, దినపత్రికలపై మండిపడ్డారు. కొన్ని మీడియా సంస్థలు ‘మేం ఏది చెబితే అదే వేదం.. మేం ఏది చేస్తే అదే కరెక్ట్’ అనే ధోరణితో వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటికీ పాత భావజాలాన్ని ఆయా సంస్థలు వదులుకోవడం లేదని దుయ్యబట్టారు. జర్నలిస్ట్, ఎమ్మెల్యే క్రాంతికిరణ్ సన్మాన కార్యక్రమానికి హాజరైన కేటీఆర్, కొన్ని మీడియా సంస్థల తీరును తీవ్రంగా తప్పుపట్టారు.

తెలంగాణలో ఎవ్వరూ ఆధిపత్యం చెలాయించాలని కోరుకోవడం లేదనీ, ఇప్పటికైనా పాత ఆలోచనా ధోరణిని మార్చుకోవాలని సూచించారు. ఇక్కడ పొద్దున లేవగానే అమరావతి వార్తలు చూస్తున్నామని వ్యాఖ్యానించారు. అమరావతి వార్తలతో తమకు ఇబ్బంది లేదనీ, కానీ అమరావతిలో కూడా తెలంగాణ వార్తలు వేయాలనే సంస్కారం ఉండాలి అని చురకలు అంటించారు. కానీ ఏపీలో తెలంగాణ వార్తలు రావన్నారు. తాను ఢిల్లీకి పోయినప్పుడు ఓ పత్రికను తిరగేస్తే, అసలు తెలంగాణ వార్తలే కనిపించలేదనీ, అసలు దేశంలో తెలంగాణ అనే రాష్ట్రం, దానికి ఓ ముఖ్యమంత్రి కూడా లేనట్లు సదరు పత్రిక తీరు ఉందన్నారు.

ఈ విషయమై అక్కడే ఉన్నవాళ్లను అడిగితే ‘అది ఏపీ ఎడిషన్ సార్’ అని జవాబిచ్చారని గుర్తుచేసుకున్నారు. ఏపీ ఎడిషన్ లో తెలంగాణ వార్తలు రాయనప్పుడు తెలంగాణలో ఆంధ్రా వార్తలు ఎందుకని ప్రశ్నించారు. దీనిపై జర్నలిస్టులు అందరూ ఆలోచించాలని కోరారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడితే కొందరికి కోపం వస్తుందన్నారు.

మేమే అధిపత్యం చేస్తాం.. మేం చెప్పిందే వినాలి అనే డ్రామాలు ఇకపై నడవవని స్పష్టం చేశారు. తెలంగాణ పత్రికలు, మాధ్యమాలకు పెద్దపీట వేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించే బాధ్యతను తాను తీసుకుంటున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. కేసీఆర్ ప్రకటించిన పథకాలను చంద్రబాబు కాపీ కొడుతుంటారని ఎద్దేవా చేశారు. ఏపీ ప్రజలు, జర్నలిస్టులు తెలివైనవాళ్లు, చైతన్యవంతులని వ్యాఖ్యానించారు.