మంత్రాలయ రాఘవేంద్రస్వామిని దర్శించుకున్న అమిత్ షా

  • ఆరోగ్యశాలను ప్రారంభించడం ఆనందంగా ఉంది
  • మఠాలు, ధర్మస్థలాలు సామాజిక సేవలూ చేయాలి
  • బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా

మంత్రాలయ రాఘవేంద్ర స్వామిని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మఠం అధికారులు, బీజేపీ నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం, గ్రామదేవత మంచాలమ్మ, రాఘవేంద్రస్వామి మూల బృందావనాన్ని ఆయన దర్శించుకున్నారు. పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులు ఆయనకు శాలువా కప్పి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా మఠానికి చెందిన సుజయీంద్ర ఆరోగ్యశాలను అమిత్ షా ప్రారంభించారు. అనంతరం, మఠం ఆధ్వర్యంలో కొనసాగుతున్న గోశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, మంత్రాలయంలో ఆరోగ్యశాలను ప్రారంభించడం తనకు ఆనందంగా ఉందని అన్నారు. మఠాలు, ధర్మస్థలాలు పూజా క్రతువులకే పరిమితం కాకుండా సామాజిక సేవలు కూడా చేయాలని సూచించారు. కాగా, మంత్రాలయంలో జరుగుతున్న ఆర్ఎస్ఎస్ జాతీయ స్థాయి సమన్వయ సమావేశంలో పాల్గొనే నిమిత్తం ఆయన ఇక్కడికి వచ్చారు.