భూమా అఖిలప్రియకు షాకిస్తూ, వైసీపీ అభ్యర్థికి మద్దతు పలికిన గంగుల!

భూమా అఖిలప్రియకు షాకిస్తూ, వైసీపీ అభ్యర్థికి మద్దతు పలికిన గంగుల!

ఆళ్లగడ్డ నియోజకవర్గంలో టీడీపీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. మాజీ ఎంపీ గంగుల ప్రతాప్‌రెడ్డి అనూహ్యంగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. దీంతో మంత్రి అఖిలప్రియకు ఝలక్‌ ఇచ్చినట్టయ్యింది. గంగుల ప్రతాప్‌రెడ్డి నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా టీడీపీలో చేరిన విషయం విదితమే. ఆయన అదే పార్టీలో కొనసాగుతుండడంతో గంగుల వర్గం ఓట్లు చీలి తమకు లాభిస్తుందని అఖిలప్రియ భావించారు.

కానీ మంగళవారం గంగుల ప్రతాప్‌రెడ్డి ఆళ్లగడ్డలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి గంగుల బిజేంద్రారెడ్డి (నాని), కుటుంబ సభ్యులు గంగుల మనోహర్‌రెడ్డి, గంగుల సుదర్శన్‌రెడ్డి, గంగుల ఫణిక్రిష్ణారెడ్డి, గంగుల భరత్‌రెడ్డి, కేంద్ర కాటన్‌ బోర్డు మాజీ డైరెక్టర్‌ సీపీ శ్రీనివాసరెడ్డి(వాసు)లతో సమావేశమయ్యారు. ఎన్నికల ప్రణాళికపై చర్చించి.. గంగుల బిజేంద్రారెడ్డిని గెలిపించేందుకు కృషి చేయాలంటూ తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. గంగుల కుటుంబమంతా ఏకం కావడంతో నియోజకవర్గంలో టీడీపీకి గట్టి షాక్‌ తగిలినట్లయ్యింది.

బిజేంద్రను భారీ మెజార్టీతో గెలిపించండి
ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని గంగుల వర్గీయులు, ప్రజలు కలిసి బిజేంద్రారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని గంగుల ప్రతాప్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. నంద్యాల ఉప ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు తనను సాయం అడిగినందున ఆ పార్టీ అభ్యర్థి కోసం పనిచేశానన్నారు. ఆ సమయంలో తనతో మాట్లాడుతూ నంద్యాల పార్లమెంట్‌కు సరైన అభ్యర్థి ఎవరూ లేరని, మీరే సరైన అభ్యర్థి అని తనతో చెప్పారన్నారు.అయితే..ఇప్పుడు కనీసం తనను సంప్రదించకుండానే ఎంపీ అభ్యర్థిని ఎంపిక చేశారన్నారు. మాట తప్పడం చంద్రబాబు నైజమని అందరూ చెప్పారని, కానీ అప్పట్లో ఆయన మాటలను నమ్మాల్సి వచ్చిందని అన్నారు. ప్రజాబలం ఉన్నవారినే అభ్యర్థులుగా ఎంపిక చేస్తానన్న చంద్రబాబు..చివరకు ధన బలం చూసే ఎంపీ అభ్యర్థిని ఎంపిక చేశారన్నది స్పష్టమవుతోందన్నారు. సమావేశంలో సీపీ రామకృష్ణారెడ్డి, గంధం రాఘవరెడ్డి, నాసారి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Tags: Andhra Pradesh, Election 2019, Lok Sabha Election 2019,bhuma akhila, priya,gangula nani,TDPY,SRCP