భూగర్భంలో 17 అంతస్థుల హోటల్.. చైనా మరో ఘనత!

ప్రపంచ అద్భుతాలకు కేరాఫ్ అయిన చైనా తాజాగా మరో అద్భుత కట్టడాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. వాడకుండా వదిలేసిన ఓ క్వారీలో 17 అంతస్థుల హోటల్‌ను నిర్మించి అబ్బురపరిచింది. 290 అడుగుల లోతున్న గుంతలో ఈ హోటల్ నిర్మించడం విశేషం. ఇంత లోతున్న గోతిలో వరద నీరు చేరకుండా చూస్తూ ఈ అద్భుత నిర్మాణానికి ఇంజినీర్లు డిజైన్ రూపొందించారు. ఇంటర్ కాంటినెంటల్ షాంఘై వండర్‌లాండ్ హోటల్లో మొత్తం 336 గదులు ఉన్నాయి. ఇక్కడే మరో థీమ్ పార్క్‌ను కూడా అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ మొత్తం ఖర్చు 28.8 కోట్ల డాలర్లు కావడం విశేషం. ఈ క్వారీలో ఓ గోడకు హోటల్‌ను నిర్మించగా.. దానికి ఎదురుగా ఓ వాటర్ ఫాల్‌ను ఏర్పాటు చేశారు. సెంట్రల్ షాంఘై నుంచి గంట పాటు ప్రయాణిస్తే ఈ హోటల్‌కు చేరుకోవచ్చు.

ఇందులో ఓ గది బుక్ చేసుకోవాలంటే రోజుకు 490 డాలర్లు ఖర్చువుతుంది. క్వారీలో ఉన్న నీటి లోపల కూడా ఓ అంతస్థును నిర్మించారు. అసలు ఈ క్వారీ హోటల్ ప్రాజెక్ట్‌కు సరితూగే నిర్మాణమే ప్రపంచంలో లేదు అని చీఫ్ ఇంజినీర్ చెన్ షియోజియాంగ్ అన్నారు. గతంలో ఇలాంటి హోటల్‌ను ఎప్పుడూ చూసి ఉండరు అని ఆయన చెప్పారు. 2013లో దీని నిర్మాణం మొదలుపెట్టారు. అయితే ఆ ఏడాదే భారీ వర్షాల కారణంగా సమీపంలోని నది ఉప్పొంగి ఈ క్వారీలోకి నీళ్లు చేరాయి. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి ఘటన జరగకుండా ఉండేందుకు ఇంజినీర్లు క్వారీ ఫైబాగాన ఓ గట్టును నిర్మించారు. క్వారీలో నీటి స్థాయిని ఎప్పుడూ ఒకేలా ఉంచేందుకు ప్రత్యేకంగా పంప్ హౌజ్‌ను వాడుతున్నారు.