భారత రాజకీయపార్టీలు మా సేవలను దుర్వినియోగం చేస్తున్నాయి.. బ్యాన్ చేస్తాం: వాట్సాప్ హెచ్చరిక

భారత రాజకీయపార్టీలు మా సేవలను దుర్వినియోగం చేస్తున్నాయి.. బ్యాన్ చేస్తాం: వాట్సాప్ హెచ్చరిక

భారతదేశంలోని రాజకీయ పార్టీలు తమ సేవలను దుర్వినియోగం చేస్తున్నాయని ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ అసహనం వ్యక్తం చేసింది. తమ ప్రత్యర్థి పార్టీలపై అభ్యంతరకర వ్యాఖ్యలు, వీడియోలను అన్ని రాజకీయ పార్టీలు వాట్సాప్ ద్వారా వైరల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వాట్సాప్ అన్ని రాజకీయ పార్టీలకు హెచ్చరిక జారీ చేసింది. తాము సదుద్దేశంతో నిర్వహిస్తున్న వాట్సాప్ సేవలను దుర్వినియోగం చేయవద్దని, అభ్యంతరకర సమాచారాన్ని షేర్ చేయవద్దని సూచించింది. ఎన్నికల నేపథ్యంలో, తాము పూర్తి స్థాయిలో నిఘా పెట్టబోతున్నామని… అభ్యంతరకర సమాచారాన్ని గుర్తించి, తొలగించేందుకు కృషి చేస్తామని చెప్పింది.

వాట్సాప్ కమ్యూనికేషన్స్ హెడ్ కార్ల్ వూగ్ మాట్లాడుతూ, వాట్సాప్ నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ పార్టీలు తమ సేవలను వాడుకుంటున్నట్టు తాము గుర్తించామని… ఇకపై కూడా ఇదే విధంగా వ్యవహరిస్తే వాటిపై నిషేధం విధిస్తామని హెచ్చరించారు. భారీ ఎత్తులో సందేశాలను పంపడం తమ నిబంధనలకు విరుద్ధమని చెప్పారు. ఆటోమేటెడ్ రోబోటిక్స్ ద్వారా పెద్ద ఎత్తున సందేశాలను పంపడం చేయవద్దని తెలిపారు. ఇదే విషయాన్ని గత ఏడు నెలలుగా రాజకీయ పార్టీలకు తాము వివరిస్తున్నామని చెప్పారు.