భారత కుబేరులు.. మూడింతలు

2027 కల్లా 357 మంది బిలియనీర్లు
అమెరికా, చైనాల తరువాత స్థానం మనదే
వచ్చే దశాబ్ద కాలంలో భారత్‌లోని కుబేరుల సంఖ్య మూడింతలు అవుతుందని ఓ నివేదిక అంచనా కట్టింది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక కుబేరులు(బిలియనీర్లు) ఉన్న మూడో దేశంగా భారత్‌ ఉండగా.. పదేళ్ల తర్వాత కూడా అదే స్థానంలో కొనసాగనుంది. ప్రస్తుతం భారత్‌లో 119 కుబేరులుండగా.. 2027 కల్లా వీరి సంఖ్య 357కు చేరుతుందని అఫ్రేషియా బ్యాంక్‌ గ్లోబల్‌ వెల్త్‌ మైగ్రేషన్‌ రివ్యూ నివేదిక చెబుతోంది. అంటే వచ్చే పదేళ్లలో అదనంగా 238 బిలియనీర్లు భారత్‌లో పుట్టుకొస్తారని అంటోంది. బిలియనీర్‌ అంటే బిలియన్‌ డాలర్ల(దాదాపు రూ.6700 కోట్లు) సంపద ఉన్న వారు. ఆ నివేదిక ఏం చెబుతోందంటే..
* చైనా విషయానికొస్తే 2027 కల్లా అదనంగా 448 కుబేరులు జతచేరుతారు.
* వచ్చే దశాబ్దంలో అత్యధిక కుబేరులున్న దేశాల్లో అమెరికా(884) తొలి స్థానంలో నిలుస్తుంది. ఆ తర్వాతి దేశాల్లో చైనా(697), భారత్‌(357)లుంటాయి.
* రష్యా ఫెడరేషన్‌(142), యునైటెడ్‌ కింగ్‌డమ్‌(113), జర్మనీ(90), హాంకాంగ్‌(78)లు కూడా బిలియనీర్ల సంఖ్యను మెరుగుపరచుకోగలవు.
* అంతర్జాతీయంగా 2,252 బిలియనీర్లుండగా.. వారి సంఖ్య 2027 కల్లా 3,444కు చేరుకోవచ్చు.
* దేశంలో నివసిస్తున్న అందరి సంపదను దృష్టిలో పెట్టుకుంటే.. 8,230 బిలియన్‌ డాలర్లతో భారత్‌ ప్రపంచంలోనే ఆరో స్థానంలో ఉంది. ఈ విషయంలో అమెరికా (62,584 బి. డాలర్లు); చైనా (24,803 బి. డాలర్లు), జపాన్‌ (19,522 బి. డాలర్లు)లు తొలి మూడు స్థానంలో ఉన్నాయి.
* భారీ స్థాయిలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు రావడం, మంచి విద్యా వ్యవస్థ, ఐటీకి భవిష్యత్‌ బాగుండడం, స్థిరాస్తి, ఆరోగ్య సంరక్షణ, మీడియా రంగాలు 200 శాతం మేర వృద్ధి సాధిస్తాయన్న అంచనాల వల్ల భారత్‌ సహా మిగతా దేశాల్లో కుబేరుల సంఖ్య పెరగనుంది.
* పదేళ్లలో అంతర్జాతీయ సంపద 50 శాతం పెరిగి 321 లక్షల కోట్ల డార్లకు చేరనుంది.
* శ్రీలంక, భారత్‌, వియత్నాం, చైనా, మారిషస్‌లలో సంపద వేగంగా వృద్ధి చెందుతోంది.