బీజేపీని వ్యతిరేకిస్తున్నారంటే హిందువులను వ్యతిరేకిస్తున్నట్లు కాదు:ఆర్‌ఎస్ఎస్ నేత భయ్యాజీ

ప్రజలు బీజేపీని వ్యతిరేకిస్తున్నారంటే హిందూత్వంను వ్యతిరేకిస్తున్నట్లు కాదనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆర్ఎస్ఎస్ జనరల్ సెక్రటరీ సురేష్ భయ్యాజీ జోషీ. బీజేపీ కేవలం రాజకీయ పోరాటం మాత్రమే చేస్తోందని అన్నారు. ఈ పోరాటంలో బీజేపీని ప్రజలు తిరస్కరిస్తున్నారంటే దానర్థం వారు హిందుత్వానికి వ్యతిరేకం కాదని చెప్పిన భయ్యాజీ… బీజేపీకి హిందూత్వంకు లింకు పెట్టరాదని స్పష్టం చేశారు. హిందూ సామాజిక వర్గానికి హిందువులే శతృవులుగా మారుతున్నారన్న ప్రశ్న సరికాదన్నారు. హిందూత్వం అంటే బీజేపీ కాదని భయ్యాజీ వివరించారు. విశ్వగురు భారత్‌ అనే కార్యక్రమంలో లెక్చర్‌ ఇచ్చిన ఆయనకు పై ప్రశ్న ఎదురైంది.

హిందువు హిందువుతో గొడవపడుతాడు భారత పౌరసత్వ సవరణ చట్టంను తీసుకొచ్చిన బీజేపీ ప్రభుత్వం పై దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్న నేపథ్యంలో ఆర్‌ఎస్ఎస్ నేత భయ్యాజీ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమయ్యాయి. ఈ చట్టం ముస్లిం సామాజిక వర్గానికి వ్యతిరేకంగా ఉందని చెబుతూ నిరసనలు జరుగుతున్నాయి. ఇక ఢిల్లీలోని షాహీన్‌బాగ్ కేంద్రంగా సాగిన ప్రచారం ఆ తర్వాత ఎన్నికలు, ఆపై వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు బీజేపీకి ఓటమి తప్పదనే జోస్యం చెప్పాయి. ఒక హిందూ మరో హిందువుపై గొడవ పడతాడని ఆ సమయంలో వారికి తమ మతం గుర్తుండదని భయ్యాజీ చెప్పారు. ఛత్రపతి శివాజీ కూడా సొంత కుటుంబం నుంచే వ్యతిరేకతను ఎదుర్కొన్న విషయాన్ని భయ్యాజీ గుర్తుచేశారు.
కమ్యూనిస్టులు కొందరు స్వామి వివేకానంద బోధించిన హిందూత్వం మంచిదంటారు కానీ వినాయక్ సావర్కర్ బోధించిన హిందూత్వం మంచిదికాదంటారని చెప్పిన భయ్యాజీ… అలాంటి మాటలను ఎలా చూడాలని ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్‌లో కమ్యూనిస్టులు హిందూత్వానికి వ్యతిరేకమని చెబుతారన్న భయ్యాజీ… దుర్గా పూజ సమీపిస్తున్న నేపథ్యంలో మంటపాలు వేయడంలో అదే కమ్యూనిస్టులు ముందు వరుసలో ఉంటారని చెప్పారు. ఇక కేరళలో కూడా కమ్యూనిస్టులు ఆలయకమిటీకి అధ్యక్షులుగా ఉండాలని కోరుకుంటారని గుర్తుచేశారు భయ్యాజీ.

ఆర్‌ఎస్‌ఎస్‌లో అన్ని మతాలకు చోటు ఉంటుంది హిందువులు రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని.. ఆర్ఎస్ఎస్‌లోకి అన్ని మతాల వారికి ఆహ్వానం ఉందని పునరుద్ఘాటించారు. తాము హిందూయేతర వ్యక్తులను సంఘ్‌లో చేరకుండా ఎప్పుడూ నిలువరించలేదన్న విషయాన్ని గుర్తుచేశారు. హిందూత్వంపై ఫోకస్ చేసిన మాట వాస్తవమేనన్న భయ్యాజీ… క్రైస్తవులు, లేదా ముస్లింలకు ఆర్ఎస్ఎస్ భావజాలం నచ్చితే వచ్చి చేరొచ్చని ఆహ్వానం పలికారు. సంఘ్‌లో చేరిన తర్వాత భారత్‌ మాతా కీ జై అని నినదించేందుకు అంగీకరించకుంటే భారత్‌ను తన తల్లితో సమానంగా చూడటం లేదని భావించాల్సి ఉంటుందని అదే జరిగితే వారు సంఘ్‌లో ఉండేందుకు అనర్హులవుతారని చెప్పారు.

ఆర్‌ఎస్ఎస్‌లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు వేధింపులు ఉత్తర్ ప్రదేశ్‌లో చాలామంది ముస్లింలు ఆర్‌ఎస్ఎస్‌‌లో జాయిన్ అయ్యారని చెప్పారు. ఆర్‌ఎస్ఎస్‌లో చేరే హిందూయేతర వ్యక్తులకు హిందువులతో సమానంగా పదవులు ఉంటాయన్నారు. వారికంటూ ఒక ప్రత్యేకమైన పదవి ఉండదని అయితే గౌరవప్రదమైన పదవి ఉంటుందని చెప్పారు. రాజకీయాల్లో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనరాదని ఉంది కానీ ఆర్ఎస్ఎస్‌లో ప్రభుత్వ ఉద్యోగులు కూడా చేరొచ్చని చెప్పారు. దేశంలో నివసిస్తూ దేశ సంక్షేమం, దేశంలో సంభవించనున్న ప్రమాదాల గురించి మాట్లాడితే రాజకీయ కోణంలో వ్యాఖ్యానిస్తున్నారని అనటం దురదృష్టకరమన్నారు. ఆర్‌ఎస్ఎస్‌లో చేరే ఏ ప్రభుత్వ ఉద్యోగి తన ఉద్యోగం కోల్పోరని చెప్పారు భయ్యాజీ. ఆర్‌ఎస్ఎస్‌లో చేరినందుకు ప్రభుత్వ ఉద్యోగస్తులను వేధింపులకు గురిచేస్తున్నారని చెప్పారు.