బిహారీలు కిడ్నాప్‌ చేశారంటూ.. పరుగులు పెట్టించిన 11 ఏళ్ల బాలుడు

హైదరాబాద్‌: గుడివాడ నుంచి రైలెక్కి హైదరాబాద్‌కు వచ్చాడు.. రైలులో అనుమానాస్పదంగా సంచరిస్తూ అనూహ్యంగా పోలీసులకు చిక్కాడు.. ఇద్దరు బిహారీలు తనను కిడ్నాప్‌ చేసి తీసుకొచ్చారని చెప్పాడు.. తన పక్కనే ఉన్న ఓ మతిస్థిమితం లేని వ్యక్తిని చూపి ఇతడే కిడ్నాపర్‌ అని నమ్మించాడు.. తీరా ఆరా తీస్తే అంతా నాటకమని తేలడంతో పోలీసులే నోరెళ్లబెట్టాల్సిన పరిస్థితికి కారణమయ్యాడు. 11 ఏళ్లే అయినా రాచకొండ పోలీసులను పరుగులు పెట్టించిన బాలుడి కథాకమామిషు ఆలస్యంగా వెలుగుచూసింది. బుధవారం రాత్రి చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలు ఇలా..అనుమానాస్పదంగా కనిపిస్తున్న బాలుడితోపాటు మరో ఆగంతుకుడు తమ అదుపులో ఉన్నారంటూ బుధవారం రాత్రి 8.30 గంటల సమయంలో కుషాయిగూడ ఠాణా గస్తీ బృందానికి సమాచారం అందింది. పది నిమిషాల్లోనే పోలీస్‌ బృందం ఘటనాస్థలికి చేరుకొని బాలుడిని అదుపులోకి తీసుకొంది. ప్రాథమిక వివరాల గురించి ఆరా తీస్తే తనది గుడివాడ అని చెప్పిన బాలుడు.. ఇద్దరు యువకులు తనను కిడ్నాప్‌ చేసి తీసుకొచ్చాడని చెప్పాడు. ‘బుధవారం పాఠశాల ముగిశాక పుస్తకాల సంచి ఇంట్లో వేసి ఆడుకునేందుకు బయటకు వచ్చాను. ఇద్దరు యువకులు బైక్‌పై వచ్చి మీ స్నేహితులంతా సికింద్రాబాద్‌ ఎగ్జిబిషన్‌కు వెళ్తున్నారని చెప్పారు. వస్తే మాతో తీసుకెళ్తామని చెప్పడంతో బైక్‌పై వచ్చాను. గుడివాడ నుంచి విజయవాడ సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌ వరకు బైక్‌పై వెళ్లాం. అక్కడి నుంచి కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్‌కు బయలుదేరాం.. చర్లపల్లిలో రైలు ఆగడంతో ఇక్కడ దిగాం..’ ఇదీ పోలీసులకు బాలుడు చెప్పిన సారాంశం. దీనికితోడు తనతోపాటు వచ్చిన ఓ బిహారీ ఇతడే అని ఓ ఆగంతుకుడిని చూపించాడు. పోలీసులు ఆ ఆగంతుకుడిని అదుపులోకి తీసుకుని విచారించగా సరైన సమాధానం లేకపోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇద్దరిని కుషాయిగూడ ఠాణాకు తరలించారు.
అతడే కిడ్నాపర్‌.. ఓ నాటకం
బాలుడు చెప్పిన విషయాలపై పోలీసులు ఆరా తీయగా పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. బాలుడిదంతా నాటకమని దర్యాప్తులో తేలింది. ఇంతకీ అసలేం జరిగిందంటే.. ఆ బాలుడు గుడివాడలో ఓ మహిళా కానిస్టేబుల్‌ కొడుకు. తాత ఇంటి దగ్గర ఉండే బాలుడు. బడికి సరిగా వెళ్లేవాడు కాదు. ఆ విషయంపై ఇంట్లో ఒత్తిడి చేస్తే బయటకు వెళ్లిపోయి తిరిగి వస్తుంటాడు. గతంలో అలాగే రెండుసార్లు ఇంట్లో నుంచి పారిపోయి తిరిగి వచ్చాడు. అదే క్రమంలో బుధవారం ఉదయమే ఇంట్లో నుంచి బయటకు వచ్చేశాడు. గుడివాడ నుంచి విజయవాడ వరకు వెళ్లి కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ రైళ్లో హైదరాబాద్‌ బయలుదేరాడు. బోగీలో ప్రయాణికులు మెట్లెక్కే వద్ద కూర్చుని రాకపోకలకు ఇబ్బందులు కలుగజేస్తుండటంతో జనగామ ప్రాంతంలో ఆ బాలుడిని కొందరు ప్రయాణికులు మందలించారు. అదే రైళ్లో హైదరాబాద్‌ వస్తున్న ఈసీఐఎల్‌ ఉద్యోగి ఒకరికి బాలుడి కదలికలపై అనుమానమొచ్చింది. సదరు ఉద్యోగి బాలుడిని గట్టిగా నిలదీయడంతో కిడ్నాప్‌ నాటకం ఆడాడు. అదే బోగీలో మరోవైపు ఉన్న ఓ బిహారీని చూపించి అతడే కిడ్నాపర్‌ అంటూ చెప్పాడు. అయితే ఆ బిహారీ మతిస్థిమితం లేనివాడు కావడం.. తన పేరు చోటూ అని తప్ప ఇంకా ఏదీ చెప్పకపోవడం.. అతడి వాలకం సరిగా లేకపోవడంతో ఆ ఉద్యోగికి అనుమానం మరింత బలపడింది.

గుడివాడలో సీసీ కెమెరాల పరిశీలన
ఈ నేపథ్యంలో బాలుడి దగ్గర నుంచి తాత చరవాణి నంబరును తీసుకున్నారు. ఫోన్‌లో బాలుడి తాతకు విషయం చెప్పడంతో ఆయన గుడివాడ ఠాణాకు పరిగెత్తారు. విషయం గుడివాడ ఎస్సై షబ్బీర్‌ అహ్మద్‌కు చెప్పడంతో ఆయన వెంటనే ఫోన్‌లో ఈసీఐఎల్‌ ఉద్యోగికి ఫోన్‌ చేశారు. సమీపంలో రైల్వే పోలీసులకు అప్పగించాలని సూచించారు. అప్పటికే రైలు చర్లపల్లి ప్రాంతానికి చేరుకోవడంతో బిహారీతోపాటు బాలుడిని రైల్వే పోలీసులకు అప్పగించారు. మరోవైపు బాలుడు గుడివాడలో ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన ప్రాంతంతోపాటు విజయవాడ రైల్వేస్టేషన్‌ మార్గంలో ఎస్సై షబ్బీర్‌ సీసీ కెమెరాలను పరిశీలించారు. బాలుడు ఒక్కడే వెళ్లినట్లు దృశ్యాలు నమోదై ఉండటంతో కిడ్నాప్‌ నాటకం ఆడాడని నిర్ధారణకు వచ్చారు. అదే రోజు ఒక కేసు విషయంలో గుడివాడ నుంచి హైదరాబాద్‌లోని ఫొరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌కు వచ్చిన కానిస్టేబుల్‌కు ఫోన్‌ చేసిన ఎస్సై.. కుషాయిగూడ ఠాణాకు వెళ్లాల్సిందిగా సూచించారు. బాలుడితోపాటు ఆగంతుకుడిని ఆ కానిస్టేబుల్‌ గుడివాడకు తీసుకెళ్లారు. మరోసారి చేసిన దర్యాప్తులో ఆగంతుకుడికి ఏం సంబంధం లేదని నిర్ధారణకు రావడంతో వదిలేశారు. బాలుడికి కౌన్సెలింగ్‌ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించామని ఎస్సై షబ్బీర్‌ అహ్మద్‌ తెలిపారు.