‘బిగ్‌బాస్’ పేరుతో వెకిలి చేష్టలు ఆపండి.. హెచ్ఆర్‌సీలో ఫిర్యాదు

ఒకే ఇంట్లో 16 మందిని బంధించడం మానవ హక్కుల ఉల్లంఘనే
విపరీత టాస్క్‌లతో బానిసల్లా చూస్తున్నారు
షోతో సమాజంలోకి తప్పుడు సంకేతాలు
స్టార్ ‘మా’ ఛానల్‌లో ప్రసారమవుతున్న ‘బిగ్‌బాస్’ షో చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. షో పేరుతో ఒకే ఇంటిలో 16 మందిని నిర్బంధించి వెకిలి చేష్టలకు పాల్పడుతున్నారని, ఈ షోతో ప్రజల మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆరోపిస్తూ హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్‌సీ)లో ఫిర్యాదు చేశారు. ఈ షో ద్వారా మహిళలను కించపరుస్తున్నారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. షో వల్ల సమాజానికి ఇసుమంతైనా ఉపయోగం లేదని, వెకిలి చేష్టలు తప్ప ఇంకేమీ ఉండడం లేదని పేర్కొన్నారు.

కేవలం లాభాపేక్షతో వ్యాపార సంస్థలతో కుమ్మక్కై యాజమాన్యాలు ఇటువంటి షోలను ప్రసారం చేస్తున్నాయని పిటిషనర్ ఆరోపించారు. కేవలం టీఆర్పీలను పెంచుకునేందుకే షో ఉందని పేర్కొన్నారు. షోలో ఎక్కడా, ఎవరికీ కనబడని బిగ్‌బాస్ చిత్రవిచిత్ర ఆదేశాలతో పోటీదారులను హింసిస్తున్నారని ఆరోపించారు. బాత్రూములు కడగాలని, మరేదో చేయాలని… టాస్క్‌ల పేరుతో పోటీదారులను బానిసల్లా చూస్తున్నారని విమర్శించారు. ఇది పూర్తిగా చట్టవిరుద్ధమని పిటిషనర్ పేర్కొన్నారు.

షోలో పాల్గొన్న వారిని ఒకే ఇంట్లో బంధించి అందులోంచి బయటకు రానివ్వకుండా అడ్డుకోవడం మానవ హక్కుల ఉల్లంఘన కిందికే వస్తుందన్నారు. బిగ్‌బాస్ షోలోని టాస్క్‌ల వల్ల సమాజంలోకి చెడు సంకేతాలు వెళుతున్నాయని న్యాయవాది భాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ షో చూస్తున్న వారు కూడా ఉద్రేకానికి, మానసిక వేదనకు గురయ్యే అవకాశం ఉందని, కాబట్టి తక్షణం దీనిని నిలిపి వేయించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు.