బాలీవుడ్ తారలపై పిచ్చితో... 304 కోట్లతో బెహ్రయిన్ రాకుమారుడి డీల్!

బాలీవుడ్ తారలపై పిచ్చితో… 304 కోట్లతో బెహ్రయిన్ రాకుమారుడి డీల్!

తనకు చెల్లించాల్సిన ఫీజులు, ఖర్చులను చెల్లించలేదంటూ, ఈజిప్టుకు చెందిన వ్యాపారి అహ్మద్ అబ్దెల్ అబ్ధుల్లా, బెహ్రయిన్ యువరాజు షేక్ హమద్ ఐసా అలీ అల్ ఖలీఫాపై 16 మిలియన్ పౌండ్లకు (సుమారు రూ. 147.5 కోట్లు) దావా వేయడంతో, ఓ ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో తన వాదన వినిపించేందుకు ఇంగ్లండ్ హైకోర్టుకు హాజరైన అల్ ఖలీఫా, తనకు బాలీవుడ్ తారలంటే పిచ్చని, వారిని ప్రత్యక్షంగా కలిపిస్తానని అహ్మద్ తన ముందుకు వస్తే, 33 మిలియన్ పౌండ్లు (సుమారు రూ. 304 కోట్లు) చెల్లించేందుకు డీల్ కుదుర్చుకున్నానని చెప్పాడు.

ఇప్పుడిలా తనపై దావా వేశారని తెలిసి ఆశ్చర్య పోయానని వ్యాఖ్యానించారు. భారత చిత్ర పరిశ్రమకు చెందిన 26 మంది టాప్ నటీనటులతో తనను కలిపిస్తానని అబ్దుల్లా చెప్పాడని తెలిపారు. బాలీవుడ్ లోని షారూక్ ఖాన్, రణ్ వీర్ సింగ్, ఐశ్వర్యా రాయ్ వంటి ఎందరినో కలవాలన్నది తన జీవితాశయమని, ఆ కోరికను తీర్చుకునేందుకు ఇప్పటివరకూ అహ్మద్ కు 2.7 మిలియన్ పౌండ్లు చెల్లించానని, ఈ దావా ఎందుకు వేశాడో తెలియదని చెప్పారు. ఇప్పటివరకూ తాను నలుగురు బాలీవుడ్ తారలను కలిశానని, అందుకు సహకరించిన అహ్మద్ కు కృతజ్ఞతలు కూడా చెప్పానని అన్నారు. తానిచ్చిన 2.7 మిలియన్ పౌండ్లూ, ఆయన పెట్టిన ఖర్చు, బాలీవుడ్ తారల ఫీజుతో సహా సరిపోయిందని, అంతమాత్రాన ఆయన దావా వేసినట్టుగా 16 మిలియన్ పౌండ్లు చెల్లించాల్సిన అవసరం లేదని వాదించారు. కాగా, ఈ కేసు విచారణను వాయిదా వేస్తూ, తదుపరి అహ్మద్ వాదనలను వింటామని కోర్టు తెలిపింది.