బాబూమోహన్,కొండా, దానంల‌కు ద‌క్క‌ని సీటు…? కార‌ణం ఏంటి…?

  • బాబూమోహన్ కు టికెట్ నిరాకరించిన కేసీఆర్
  • బాబూమోహన్ స్థానంలో జర్నలిస్ట్ క్రాంతికిరణ్ కి టికెట్
  • నల్లాల ఓదేలుకు కూడా టికెట్ ఇవ్వని కేసీఆర్
  • టీఆర్ఎస్ తొలి జాబితాలో కనిపించని కొండా సురేఖ పేరు
  • పెండింగ్ లో ఉంచిన కేసీఆర్
  • మధుసూదనాచారి, నన్నపునేని నరేందర్ తో విభేదాల పట్ల కేసీఆర్ సీరియస్

మాజీ మంత్రి కొండా సురేఖకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ షాక్ ఇచ్చారు. ఈరోజు 105 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించిన కేసీఆర్… కొండా సురేఖ నియోజకవర్గాన్ని పెండింగ్ లో పెట్టారు. కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన సురేఖ 2014లో వరంగల్ తూర్పు నుంచి పోటీ చేసి గెలుపొందారు.

కొండా సురేఖ పేరును కేసీఆర్ పెండింగ్ లో ఉంచడానికి చాలా కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. మాజీ స్పీకర్ మధుసూదనాచారితో పాటు, వరంగల్ మేయర్ నన్నపునేని నరేందర్ తో కొండా సురేఖ, భర్త మురళికి విభేదాలు ఉన్నాయి. రంజాన్ సందర్భంగా నరేందర్ మాట్లాడుతూ, వరంగల్ తూర్పు నియోజకవర్గానికి సైతాన్ దాపురించిందంటూ వ్యాఖ్యానించడం కలకలం రేపింది. దీంతో, నరేందర్ పై కొండా సురేఖ కూడా అంతే స్థాయిలో విరుచుకుపడ్డారు. కొందరు కొత్తగా మీసాలు మెలేస్తున్నారని, ఉన్న వెంట్రకలు ఊడటం తప్ప మరే ఉపయోగం ఉండదంటూ హెచ్చరించారు.

మరోవైపు మధుసూదనాచారి ప్రాతినిధ్యం వహిస్తున్న భూపాలపల్లిపై కూడా సురేఖ దృష్టి సారించారు. తన కుమార్తె సుస్మితా పటేల్ కు భూపాలపల్లిని కేటాయించాలని ఆమె ఆశించారు. ఈ క్రమంలో మధుసూదనాచారి వర్గీయులతో బహిరంగంగానే ఘర్షణకు దిగారు. ఈ వివాదాలన్నింటి నేపథ్యంలో, కొండా దంపతులపై కేసీఆర్ ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. ఈ కారణంగానే వరంగల్ తూర్పు సీటును ప్రకటించకుండా ఆయన పెండింగ్ లో ఉంచారు.