బాబు ఉన్న ఇళ్లు, పవన్‌కు ఇంటిస్థలం ఇచ్చింది ఒకరు కాదా?

Minister Botsa Satyanarayana Sensational Comments on Pawan Kalyan on AP Capital

అమరావతి: రాజధాని ఒక ప్రాంతానికో, ఒక వర్గానికో చెందినది కాదని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రభుత్వ ధనం దుర్వినియోగం కాకుండా చూడటం మా బాధ్యత అని తెలిపారు. విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ…”ఒక రాజధాని వెయ్యి కుంభకోణాలు అన్న చందంగా ఉందని, రోడ్ల టెండర్లలోనూ ప్రజాధనం దోచుకునేందుకు యత్నించారని ఆయన మండిపడ్డారు. తాత్కాలిక సచివాలయ నిర్మాణంలోనూ అవినీతే. గత ప్రభుత్వం స్మార్ట్‌ఫోన్ల పేరుతో ప్రజాధనం వృథా చేసింది. మాజీ సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ దోపిడీలో ప్రధాన భాగస్వాములు. టీడీపీ, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మాటలను ప్రజలు గమనిస్తున్నారు. చంద్రబాబు అధికారంలో ఉండగా ఏనాడూ పవన్ ప్రశ్నించలేదు. పవన్ టీడీపీ అవినీతిపై మాట్లాడకుండా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. టీడీపీ అవినీతిలో భాగస్వామిగా ఉన్నారన్న రీతిలో పవన్ మాటలున్నాయి. రాజధాని విషయంలో రైతులకు అన్యాయం చేస్తే చంద్రబాబు ఇంటిని ముట్టడిస్తామని పవన్ అనలేదా? రాజధానితో నూజివీడు వాసులను టీడీపీ మోసం చేసిందని పవన్ చెప్పలేదా? 5వేల ఎకరాల్లో రాజధాని కట్టేస్తామని విజయవాడలో పవన్ చెప్పలేదా? పవన్ కల్యాణ్ ద్వంద్వ వైఖరి మార్చుకోవాలి. చంద్రబాబు ఆర్థిక లావాదేవీలకు పవన్ వత్తాసు పలుకుతున్నారు. చంద్రబాబు ఉన్న ఇళ్లు, పవన్‌కు ఇంటిస్థలం ఇచ్చింది ఒకరు కాదా? 151 సీట్లు కాలం మహిమ కాదు.. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై ప్రజలు ఉంచిన విశ్వాసం” అని మంత్రి బొత్స వివరించారు.