peace

బాగున్నారా ?

ప్రపంచ భాషలన్నిటిలో – బాగున్నారా – గొప్ప పలకరింపు మాట . తెలుగులో బాగున్నారా -గురించి చెప్పడానికి భాష చాలదు . ఒకరికొకరు ఎదురయినప్పుడు అని తీరాల్సిన మాట – బాగున్నారా . దీనికి సమాధానంగా చెప్పి తీరాల్సిన మాట చాలా బాగున్నాం – మీరెలా ఉన్నారు ? అని . నిజానికి అడిగినవారు , చెప్పినవారు ఇద్దరూ అష్టకష్టాల్లో (ఈ కష్టాలు పగవాడికి కూడా వద్దు ) ఉండి ఉంటారు . కానీ పైకి చెప్పుకోరు , చెప్పుకోకూడదు . అదే మర్యాద , అదే సంస్కారం , అదే గొప్పతనం , అదే బతుకు మీద భరోసా , అదే పాజిటివ్ థింకింగ్ , అదే రేపటికి ఆశల వంతెన .

దీనికి భిన్నంగా రెండు రకాలుగా ఆలోచిస్తే ఎలా ఉంటుందో చూద్దాం . మొదటిది- అడిగేవారే మీరు ఈమధ్య చావుదప్పి కన్నులొట్టబోయి బతికి బట్టకట్టారట కదా ? ఇంకెంత కాలం బతుకుతారులెండి ! ఎపుడో అపుడు పోవాల్సినవారే కదా ? ఈమధ్య మీభార్య మిమ్మల్ను మనిషిగా గుర్తిస్తోందట కదా ? మీ పెద్దబ్బాయి వాడి భార్య మీకు కూడు కూడా పెట్టకుండా మిమ్మల్ని తగలేశారట కదా ? సమయానికి మందు బిళ్ళలు కూడా ఇచ్చే దిక్కు లేక మీరు బిక్కు బిక్కుమంటున్నారటకదా ? మీ రెండోవాడు మూడుపూటలా తాగి తందనాలాడుతూ ఊరంతా అప్పులు చేసి తిరుగుతుంటే ఆ అప్పుల వాళ్ళతో మీరు నిత్యమ్ బిజీగా ఉంటారటకదా ? మీ రెండో అమ్మాయి భర్తతో పడక వదిలేసివచ్చి నిశ్చింతగా మీతోనే హాయిగా ఉందికదా ? ఇవన్నీ చాలావరకు నిజమే అయి ఉండవచ్చు , నిజం కాకపోవచ్చు . కానీ ఇలా ఎవరూ అడగరు , అడగకూడదు . ఇన్ని విషాదాలను బాగున్నారా ఒక్క మాట దాటేస్తుంది .

రెండోది – బాగున్నారా అని మాట వరసకు అడిగినవారికి – ఏమి బాగులేండి దుర్భరంగా ఉన్నాం . షుగర్ కు ఇన్సులిన్ రెండు పూటలా 20 పాయింట్లు వేసుకుంటున్నా , బీ పి పుట్టకముందు నుండే ఉంది . మొన్ననే గుండెలు తీసిన డాక్టరు గుండెకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేశాడు . పిల్లలంతా అమెరికాలోనే . వారు ఇక్కడికి రాలేరు . మేము అక్కడ ఉండలేము . చెవులు వినపడవు , కళ్లు కనపడవు . అయినా మా ఆవిడ ఇనుపరేకులు , కోడలు కొట్టిన కాపురం , కొడుకులు రాని కొంపలు సీరియల్ 65 వేల ఎపిసోడ్ లు చూస్తూ నా చావు నన్ను చావమంటోంది . ఎందుకయినా మంచిదని శ్మశానంలోనే ఈజీ చెయిర్ వేసుకుని కూర్చున్నాను – అని ఎవరయినా చెబుతారా ? చెప్పరు , చెప్పకూడదు .

బాగున్నాం అన్న ఒక్క మాట ఇన్ని విధ్వంసాలను అందంగా కప్పేస్తుంది . అందుకే ఇదివరకు ఉత్తరం – ఉభయకుశలోపరి . నేను క్షేమం , మీరు క్షేమం . నల్లా ఇరుకు . చెన్నాగిద్దారా . కైసా హో . హౌ ఆర్ యూ – యామ్ గుడ్ . వెల్ . భాష ఏదయినా బాగున్నారా ప్రశ్న ఒకటే . ఎన్ని కష్టాలున్నా దానికి సమాధానమూ ఒకటే – చాలా బాగున్నాం .వేదాలు , ఉపనిషత్తులు కూడా అదే కోరుకున్నాయి .

సర్వే జనాస్సుఖినో భవంతు .
అందరూ అన్నివేళలా బాగుండాలి . ప్రకృతి పులకించి పుష్పించి ఫలించి ఆనందనందనంగా ప్రతిఫలించాలి . జీవితం జీవనదిలా ప్రవహిస్తూనే ఉండాలి . ప్రతిరోజునూ ఒడుపుగా వహిస్తూనే ఉండాలి . ప్రతి చెడునూ రహిస్తూనే సాగాలి . ప్రతి ఉదయాన్ని కొత్తగా లిఖిస్తూనే పోవాలి . జీవితం పరుగు కాదు . జీవితం లక్ష్యం కాదు . లాభనష్టాలు , కష్టసుఖాల లెక్కలు కానే కాదు . జీవితం దానికదిగా అన్నిరంగుల ఇంద్ర ధనుసు . అన్నికాలాల సకల ఋతువుల గొప్ప సొగసు .
సహనాభవతు
సహనౌ భునక్తు . . .
ఓం శాంతిః శాంతిః శాంతిః

శుభోదయం
-పమిడికాల్వ మధుసూదన్