ఫోన్ల ట్యాపింగ్ కోసం ఏపీ ప్రభుత్వం కొన్ని పరికరాలు కొనుగోలు చేసింది: సీఎస్ కు విజయసాయిరెడ్డి లేఖ

ఫోన్ల ట్యాపింగ్ కోసం ఏపీ ప్రభుత్వం కొన్ని పరికరాలు కొనుగోలు చేసింది: సీఎస్ కు విజయసాయిరెడ్డి లేఖ

Share This

ఇజ్రాయెల్ కు చెందిన సంస్థ వద్ద కొనుగోలు చేశారు
వాటి కొనుగోలుకు రూ.12.5 కోట్లు ఖర్చు చేశారు
ప్రతిపక్ష నేతల, ఉన్నతాధికారుల ఫోన్లు ట్యాప్ చేసే దురుద్దేశం
ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈరోజు ఓ లేఖ రాశారు. ఇజ్రాయెల్ దేశానికి చెందిన వెరింట్ సంస్థ వద్ద ఏపీ ప్రభుత్వం కొన్ని పరికరాలు, సాఫ్ట్ వేర్ కొనుగోలు చేసిందని ఆరోపించారు. ఆ పరికరాల కొనుగోలు నిమిత్తం ఆ సంస్థకు రూ.12.5 కోట్లు ఖర్చు చేసినట్టు ఆరోపించారు.

ఆ సంస్థకు చెల్లించాల్సిన బిల్లులను నిలిపివేయాలని ఆయన కోరారు. ఈ పరికరాలు కొనుగోలు చేసే ముందు నిపుణుల అభిప్రాయం తీసుకోకుండా, ఏకపక్షంగా దురుద్దేశ పూర్వకంగా వీటిని కొనుగోలు చేసిందని అన్నారు. ఏపీలో ప్రతిపక్ష పార్టీ నేతల ఫోన్లు, ఉన్నతాధికారుల ఫోన్లు ట్యాపింగ్ చేసే నిమిత్తమే ఈ పరికరాలను కొనుగోలు చేసిందని ఆయన ఆరోపించారు. ఇందుకు సంబంధించిన బిల్లులకు సొమ్ము చెల్లించే ముందు ఆయా పరికరాల వివరాలను పరిశీలించాలని ఆ లేఖలో విజయసాయిరెడ్డి కోరారు.