ఫేక్ న్యూస్‌కు అడ్డుకట్ట వేయండి.. లేకుంటే కఠిన చర్యలు తప్పవు: వాట్సాప్‌ను హెచ్చరించిన కేంద్రం

వాట్సాప్‌‌‌ సీఈవోతో కేంద్రమంత్రి రవిశంకర్ భేటీ
ఫేక్ న్యూస్ అడ్డుకట్టకు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశం
ఫేక్‌న్యూస్‌ను ఎవరు పుట్టిస్తున్నారో తెలుసుకోండి
వాట్సాప్‌లో తప్పుడు సమాచారం వ్యాప్తి కాకుండా ఉండేందుకు ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో వాట్సాప్ సీఈవో క్రిస్ డేనియల్స్‌ కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి వాట్సాప్ సేవలను అభినందిస్తూనే కొన్ని సూచనలు చేశారు. వాట్సాప్‌లో తొలుత ఫేక్ న్యూస్‌ను ఎవరు పుట్టిస్తున్నారో కచ్చితంగా తెలుసుకునే సాంకేతికతను అభివృద్ధి చేయాలని సూచించారు. భారత్‌లో ప్రత్యేకంగా కార్పొరేట్ సంస్థను ఏర్పాటు చేయాలని కోరారు.

తప్పుడు వార్తలు విపరీతంగా షేర్ అవుతూ మూక హత్యలకు కారణం అవుతున్నాయని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. వీటికి అడ్డుకట్ట వేసే చర్యలు తీసుకోవాల్సిందిగా డేనియల్స్‌కు సూచించారు. భారత్‌లో ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేకంగా ఓ అధికారిని నియమించాలన్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అయితే, పరిష్కారం కోసం తప్పకుండా కృషి చేస్తామని డేనియల్స్ హామీ ఇచ్చారు. ఫేక్ న్యూస్ ప్రసారం కాకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.