ప్రేమించి వివాహం.. మోజు తీరాక వేధింపులు.. భార్య, అత్తను చితకబాదిన మణుగూరు ఎస్సై!

వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించిన భార్య, అత్తపై దాడి చేసిన ఎస్సై వారిని దారుణంగా కొట్టాడు. బూటుకాలితో తన్నుతూ రక్తమొచ్చేలా కొట్టాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఎస్సై సముద్రాల జితేందర్ 2015లో పాల్వంచకు చెందిన పర్వీన్‌ను ప్రేమించి పెళ్లాడాడు. పెళ్లయిన వారం నుంచే భార్యను వేధించడం మొదలుపెట్టాడు. తొలిసారి గర్భం దాల్చినప్పుడు భార్యకు అబార్షన్ చేయించిన జితేందర్.. పర్వీన్ పై వేధింపులు మరింత ఎక్కువ చేశాడు. ఈ క్రమంలో జితేందర్‌కు చింతకాని నుంచి కొత్తగూడెంకు బదిలీ కావడంతో భార్యను పుట్టింటికి పంపించాడు. అయినా, అతడి వేధింపులు ఆగలేదు. తనకు రూ.50 లక్షలు కట్నం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అంతేకాదు, రెండోసారి గర్భం దాల్చిన ఆమెను మరోమారు అబార్షన్ కోసం ఒత్తిడి తెచ్చాడు. ఆమె అందుకు అంగీకరించలేదు. దీంతో గత ఏడాది కాలంగా జితేందర్ భార్య నుంచి దూరంగా ఉంటున్నాడు.

ఈ క్రమంలో పది నెలల క్రితం పర్వీన్ ఓ బాబుకు జన్మనిచ్చింది. అయినా, ఇప్పటి వరకు చూసేందుకు రాకపోవడంతో భర్తను అనుమానించింది. మరో మహిళతో వివాహేతర సంబంధం ఉండడం వల్లే అతడు తనకు దూరంగా ఉంటున్నాడని భావించింది. దీనికితోడు పదేపదే విడాకులు కావాలని ఒత్తిడి చేయడంతో అనుమానం మరింత బలపడింది. విషయాన్ని అటోఇటో తేల్చుకోవాలని గురువారం మణుగూరులోని భర్త ఇంటికి బంధువులతో కలిసి వెళ్లింది. వారిని చూసి ఆగ్రహంతో ఊగిపోయిన ఎస్సై.. భార్య పర్వీన్, అత్త తహెరాలను చితక్కొట్టాడు. గాయాలై రక్తం వస్తున్నా విడిచిపెట్టలేదు. అనంతరం జితేందర్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు చెప్పిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నామన్నారు.