పౌరసత్వ బిల్లుకు మద్దతివ్వండి

పౌరసత్వ బిల్లుకు మద్దతివ్వండి

వివాదస్పద పౌరసత్వ (సవరణ) బిల్లుపై ఈశాన్య రాష్ర్టాల్లో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నప్పటికీ, ప్రధాని నరేంద్రమోదీ ఆ బిల్లు తీసుకురావాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. మతహింసకు గురైన వారికి ఈ బిల్లు ద్వారా న్యాయం, గౌరవం చేకూరుతాయని తెలిపారు. శనివారం పశ్చిమ బెంగాల్‌లో పర్యటించిన ఆయన అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని టీఎంసీ కార్యకర్తలు దాడికి దిగుతున్నారని ఆరోపించారు. బీజేపీ పట్ల ప్రజలు ప్రేమాభిమానాలు చూపుతుండడంతో టీఎంసీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆందోళనకు గురవుతున్నారని విమర్శించారు.
దేశాన్ని ముక్కలు చేసి బ్రిటిషర్లు మనకు స్వాతంత్య్రం ప్రకటించారు. ప్రజలు తమకు నచ్చిన దేశంలో జీవించొచ్చని భావించారు. అయితే ఆయా దేశాలో మత విద్వేషం కారణంగా వారు హింసకు గురయ్యారు. వారికి మరో మార్గం కనిపించక భారత్‌కు వచ్చారు. వారికి న్యాయం, గౌరవం కల్పించలేమా? పార్లమెంటులో బిల్లు ఆమోదానికి మద్దతివ్వాలని టీఎంసీని కోరుతున్నా అని ప్రధాని అన్నారు. ఠాకూర్ నగర్‌లో మతువా మహాసంఘ్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మతువా సామాజిక వర్గ ప్రజలు 1950 ప్రారంభంలో తూర్పు పాకిస్థాన్ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. పశ్చిమ బెంగాల్‌లో సుమారు 30 లక్షల జనాభా ఉన్న ఐదు లోక్‌సభ స్థానాల ఫలితాలపై ప్రభావం చూపగలరు. అయితే వీరిలో చాలా మంది తమకు ఇప్పటికీ పౌరసత్వం లేదని చెబుతున్నారు. వీరిని తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ ఈ కార్యక్రమం చేపట్టింది.

సభలో తొక్కిసలాట
ప్రధాని ప్రసంగిస్తున్న సమయంలో ఆయనను దగ్గరి నుంచి చూసేందుకు పలువురు కార్యకర్తలు ముందుకు తోసుకురావడంతో సభలో తొక్కిసలాట జరిగింది. దీంతో పలువురు గాయపడ్డారు. వీరికి దవాఖానకు తరలించారు. ఈ ఘటన నేపథ్యంలో ప్రధాని తన ప్రసంగాన్ని 14 నిమిషాల్లోనే ముగించారు.
సాధ్యమైనంత త్వరగా మందిరం నిర్మాణం కావాలి: అమిత్ షా
అయోధ్యలో సాధ్యమైనంత త్వరగా రామ మందిరాన్ని నిర్మించాలని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా అభిప్రాయ పడ్డారు. దమ్ముంటే రామ మందిర నిర్మాణంపై కాంగ్రెస్ పార్టీ తన వైఖరేమిటో బయట పెట్టాలని సవాల్ చేశారు. డెహ్రాడూన్‌లో శనివారం జరిగిన బీజేపీ బూత్‌స్థాయి కార్యకర్తల సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ ఉత్తరాఖండ్‌లో లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. కుంభమేళాలో రామ మందిర నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేయడం సహజ పరిణామం అని పేర్కొన్నారు. రామ మందిరంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన వైఖరేమిటో నిర్వచించాలని చెప్పారు.