పైన హోమం.. కింద బంగారం మాయం.. హైదరాబాద్‌లో భారీ చోరీ!

హైదరాబాద్‌ శివారులో భారీ చోరీ జరిగింది. 20 నిమిషాల వ్యవధిలో ఓ ఇంటిని దుండగులు ఊడ్చి పడేశారు. మైలార్‌దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. శివరాంపల్లి రాఘవేంద్ర కాలనీలోని రెండంతస్తుల భవనంలోని మొదటి అంతస్తులో సంజయ్ కుమార్ అగర్వాల్ నివసిస్తున్నాడు. ఆయన పెద్ద కుమారుడు సందీప్ కుమార్ అగర్వాల్ రెండో అంతస్తులో ఉంటున్నాడు.

సందీప్ తన ఇంట్లో హోమం నిర్వహిస్తుండడంతో ఇంటికి తాళం వేసి భార్య కుమారుడితో కలిసి సంజయ్ వెళ్లాడు. 20 నిమిషాల తర్వాత హోమం ముగిసిన అనంతరం సంజయ్ కిందికి వచ్చి చూసి నిర్ఘాంతపోయాడు. ఇంటి తాళం బద్దలగొట్టి ఉంది. వెంటనే పడకగదిలోకి వెళ్లి చూడగా అక్కడి లాకర్ కూడా విరగ్గొట్టి కనిపించింది. అందులో ఉండాల్సిన 30 తులాల బంగారు నగల బ్యాగు మాయమైంది. దీంతో ఆయన లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు కేవలం నగల సంచిని మాత్రమే ఎత్తుకెళ్లడం, ఇతర వస్తువుల జోలికి వెళ్లకపోవడంతో ఇది తెలిసిన వారి పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.