పేదవాడు రోగమొస్తే భయపడకూడదు

  • ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని ప్రకటించిన మోదీ
  • తొలి విడతలో 10 కోట్ల మందికి వర్తింపు

దేశంలోని పేదలకు ఉచితంగా వైద్యసాయం అందించే లక్ష్యంతో చేపట్టిన ఆయుష్మాన్‌ భారత్‌-జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. భారత 72వ స్వాతంత్య వేడుకల సందర్భంగా ఎర్రకోటపై ఆయన జాతీయజెండా ఆవిష్కరించారు. అనంతరం జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆయుష్మాన్‌ పథకాన్ని మోదీ ప్రకటించారు.

సెప్టెంబర్‌ 25న దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ జయంతి నుంచి ఈ పథకం ప్రారంభమవుతుందని ప్రధాని వెల్లడించారు. ఈ పథకం ద్వారా దేశంలోని పేదలందరికీ ఉచిత వైద్య సాయం అందిస్తామన్నారు. తొలి విడతలో 10కోట్ల మందికి ఈ పథకం వర్తించేలా చర్యలు తీసుకుంటామన్నారు. రోగమొస్తే ఏం చేయాలన్న భయం పేదల్లో ఉండకూడదని మోదీ అన్నారు. ఇంట్లో ఒకరికి రోగమొస్తే కుటుంబమంతా దిక్కతోచని స్థితిలోకి వెళ్తుందని.. అలాంటివారందరికీ ఈ పథకం భరోసా ఇస్తుందన్నారు. ఈ పథకం అమలు కోసం అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తామన్నారు. అవసరమైన వైద్య సిబ్బంది, సదుపాయాలు అందుబాటులో ఉంచుతామన్నారు. ఆరోగ్య భారత్‌ లక్ష్యంగా ఈ పథకం పనిచేస్తుందని మోదీ తెలిపారు.

ప్రధాని ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ఈ పథకం ద్వారా ఒక్కో కుటుంబానికి ఏటా రూ.5 లక్షల మేరకు ఆరోగ్య బీమా వర్తిస్తుంది. దీనివల్ల 10 కోట్ల పేద కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుంది. మొత్తం మీద 50 కోట్ల మందికి ఈ పథకం వర్తిస్తుందని భావిస్తున్నారు. ప్రభుత్వ నిధులతో నడిచే ఆరోగ్య బీమా పథకాల్లో ఇది ప్రపంచంలోనే అతిపెద్దదని కేంద్ర వర్గాలు చెబుతున్నాయి. సామాజిక, ఆర్థిక, కుల గణాంకాల డేటా ఆధారంగా లబ్ధిదారుల గుర్తింపు సాగుతోంది. ఇప్పటికే 80 శాతం మంది గుర్తింపు పూర్తయింది. ఈ పథకం కింద 1354 చికిత్స ప్రక్రియలను ఆరోగ్య శాఖ చేర్చింది. గుండె బైపాస్‌, మోకీలు మార్పిడి తదితర శస్త్రచికిత్సలు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సీజీహెచ్‌ఎస్‌) కన్నా 15-20 శాతం తక్కువ ధరకే అందుతాయి. ఈ పథకంలో చేరిన ప్రతి ఆసుపత్రిలోనూ రోగులకు సాయం అందించడానికి ఒక ‘ఆయుష్మాన్‌ మిత్ర’ ఉంటారు. లబ్ధిదారుల అర్హతలను పరిశీలించడానికి ఒక ‘హెల్ప్‌ డెస్క్‌’ను కూడా వారు నిర్వహిస్తారు. క్యూఆర్‌ కోడ్లు కలిగిన పత్రాలను లబ్ధిదారులకు అందిస్తారు. వీటిని స్కాన్‌ చేయడం ద్వారా లబ్ధిదారులను గుర్తించడం, పథకం కింద అందే ప్రయోజనాలకు వారికున్న అర్హతలను పరిశీలిస్తారు. కనీసం పది పడకలున్న ఆసుపత్రి కూడా ఈ పథకంలో చేరొచ్చు. అవసరమైతే ఈ నిబంధనను మరింత సడలించే వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది.