పేదలు ప్రభుత్వ ఆసుపత్రికే వెళ్లాలని చంద్రబాబు శాసిస్తున్నారా ?: వైఎస్ షర్మిల

  • ఇప్పటికే బాబుతో ఏపీ పాతికేళ్లు వెనక్కి వెళ్లింది
  • టీడీపీకి ఓటేస్తే మరో ఐదేళ్లు బాధపడతాం
  • అమరావతిలో మీడియాతో మాట్లాడిన జగన్ సోదరి

పేదలు ప్రభుత్వ ఆసుపత్రికే వెళ్లాలని చంద్రబాబు శాసించారని షర్మిల చెప్పారు. మరి, అనారోగ్యం వస్తే చంద్రబాబు కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికే వెళతారా? అని ప్రశ్నించారు. డ్వాక్రా రుణాలు అన్నింటిని మాఫీ చేస్తామన్న చంద్రబాబు మాట తప్పారని విమర్శించారు. ఏపీ ప్రజలకు ఈ ఎన్నికలు చాలా కీలకమన్నారు. ఇప్పుడు తప్పు చేస్తే మరో ఐదేళ్లు బాధపడతామని హెచ్చరించారు. అమరావతిలోని వైసీపీ కార్యాలయంలో ఈరోజు ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో షర్మిల మాట్లాడారు.
బాబు వస్తేనే జాబు వస్తుందని ఊదరగొట్టిన చంద్రబాబు కుమారుడు లోకేశ్ కు మూడు పదవులు కట్టబెట్టారని షర్మిల దుయ్యబట్టారు. టీఆర్ఎస్ నేత కేటీఆర్ తెలంగాణలో ఐటీ మంత్రిగా ఉన్నారని లోకేశ్ కు ఏపీలో ఐటీ శాఖ అప్పగించారని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదాను నీరుగార్చిన చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతారని షర్మిల విమర్శించారు.   వైసీపీ అధినేత జగన్ గత 9 సంవత్సరాలుగా విలువలతో కూడిన రాజకీయం చేస్తున్నారని షర్మిల తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు ఇప్పుడు కొత్త అబద్ధాలు, దొంగ హామీలతో ప్రజల ముందుకు వస్తున్నారని ఆరోపించారు.ఏపీ సీఎం చంద్రబాబు కారణంగా ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే 25 సంవత్సరాలు వెనక్కి వెళ్లిందని వైసీపీ అధినేత జగన్ సోదరి వైఎస్ షర్మిల విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ లో భూతద్దం పెట్టి వెతికినా ఎలాంటి  అభివృద్ధి కనిపించడం లేదని ఆమె వ్యాఖ్యానించారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రైతులకు గిట్టుబాటు ధర ఉండేదనీ, అందరికి భరోసా ఉండేదని షర్మిల తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో మొదటిదాన్ని కూడా చంద్రబాబు అమలు చేయలేదని విమర్శించారు. ఏపీలో రూ.84,000 కోట్లుగా ఉన్న రైతుల రుణాలను రూ.24,000 కోట్లకు కుదించారని వ్యాఖ్యానించారు.