పెరుగుతున్న ఫణి తుపాను తీవ్రత.. 1న పెను తుపానుగా మార్పు.. రేపటి నుంచి వర్షాలు

పెరుగుతున్న ఫణి తుపాను తీవ్రత.. 1న పెను తుపానుగా మార్పు.. రేపటి నుంచి వర్షాలు

Share This

ఈ తెల్లవారుజామున తీవ్ర తుపానుగా మారిన ‘ఫణి’ రేపు అతి తీవ్రంగా, 1న పెనుతుపానుగా మారనుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. వచ్చే నెల 2, 3 తేదీల్లో ఉత్తరాంధ్ర తీరానికి దగ్గరగా ప్రయాణం చేస్తుందని పేర్కొన్నారు. అయితే, తుపాను ఎక్కడ తీరం దాటుతుందనే విషయాన్ని మాత్రం అధికారులు సరిగ్గా అంచనా వేయలేకపోతున్నారు. ఈ విషయంలో రేపు స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

నిన్న సాయంత్రానికి మాత్రం ఇది శ్రీలంకలోని ట్రింకోమలీకి 630 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి 910 కి.మీ దూరంలో, మచిలీపట్నానికి 1090 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుపాను ఉత్తరాంధ్ర తీరానికి దగ్గరగా ప్రయాణించే సమయంలో గంటకు 150 నుంచి 185 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

తుపాను ప్రభావంతో రేపు, ఎల్లుండి తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. 2, 3 తేదీల్లో ఉత్తరాంధ్ర, ఒడిశా రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉంటాయని వివరించింది.