పిరదౌసి పద్యాలు

1 .
అల్లా తోడని పల్కి నా పసిడి కావ్యద్రవ్యమున్ వెండితో చెల్లింప దొరకొన్న టక్కరివీవు నీచే పూజితుండయిన అల్లాకుసుఖమే ? సత్య వాక్యంబెవ్వడుల్లంఘింపడో వాడెపో నరుడు ధన్న్యుడిద్దరామండలిన్

2 .
ఇంక విషాద గీతములకే మిగిలె రసహీనమై మషీ పంకము నా కలమ్మున అభాగ్యుడనయితి వయహ్ పటుత్వమున్ గ్రుంకె శరీరమందలముకొన్నది వార్ధక భూతము ఈ నిరాశంకిత బ్యాష్ఫముల్ ఫలములయినవి ముప్పది ఏండ్ల సేవకున్

దిక్కుమాలిన పదబంధుర సంక్లిష్ట కృత్రిమ సమాస అక్షరారణ్యాల నుండి పద్యాన్ని తేలికగా , తేటతెలుగుకు పర్యాయంగా , సమాజహితంగా , పరుగెత్తే జవనాశ్వంలా , గురిచూసి వదిలిన బాణంలా సంధించినవాడు జాషువా . అవమానాలు , ఛీత్కారాలు , ఈసడింపులు ఎదుర్కొని తన కవితతో ప్రపంచాన్ని జయించినవాడు . తెలుగు భాషా సరస్వతిని తన వేనవేల పద్యాలతో అలంకరించినవాడు . ప్రతి పలుకులో తెలుగు అందచందాలను దట్టించినవాడు . ప్రతిపాదాన్ని ఒక సూక్తిగా మలచినవాడు . పద్యం గౌరవాన్ని పెంచినవాడు . పద్యానికి పునర్ జీవనమిచ్చినవాడు . ప్రతిమాటను శిల్పంలా చెక్కినవాడు . పలుకులచేత తళుకు కుళుకుల చాకిరీ చేయించినవాడు . చెబితే ఇంత సులభంగా , ఇంత అందంగా చెప్పాలి అని ప్రపంచం అంగీకరించి తలలూపేలా ఒకతారాన్ని ఊగించినవాడు . అప్పుడు జాషువా అంటరానివాడుగా అవమానాలు పడ్డాడు , ఇప్పుడు పద్యం అంటరానిదై కుమిలి కుమిలి ఏడుస్తోంది .

పిరదౌసి పారశీక కవి . రాజుకు తన చరిత్ర , రాజ్యం , తన గొప్పతనం మీద కావ్యం రాయించాలని కోరిక పుట్టి పిరదౌసిని పిలిపించాడు . ఒక్కో దోహా (పద్యం ) కు ఒక్కో బంగారు నాణెం ప్రతిఫలంగా ఇస్తానని నిండు సభలో ప్రతిజ్ఞ చేశాడు . పిరదౌసి నిద్రాహారాలు మాని 30 ఏళ్ళు కష్టపడి కావ్యం పూర్తిచేశాడు . ఒక శుభ ముహూర్తాన సభలోనే ఆ కావ్యగానం జరిగింది . అందరూ భళి భళీ అన్నారు . ప్రతిఫలం విషయంలో రాజు మాట తప్పాడు . బంగారుకు బదులు వెండి నాణేలు ఇచ్చాడు . అవమానం , దుఃఖంతో పిరదౌసి మనసు గాయపడింది . ఆ వెండి నాణేలను రాజు మొహం మీదే విసిరివేసి తన నిరసనను , తిరస్కారాన్ని తెలిపాడు . ఆ సందర్భలోని రెండు గొప్ప పద్యాలివి . ఇంగ్లీషు మీడియం జడలు విప్పి పల్లె పూరిపాకలబడుల్లో కూడా విలయతాండవం చేయడానికి ముందు వరకు ఈ పద్యాలు అక్కడక్కడా వినపడేవి . ఇప్పుడు పద్యం చదివినా , పాడినా , రాసినా , చివరకు పద్యాల పుస్తకం దగ్గర పెట్టుకున్నా జైల్లో పెడతారు కాబట్టి పట్టించుకోవడం మానేశాం .

పద్యాల సారం
————-
1 .
అల్లా సాక్షిగా నా బంగారం లాంటి ఒక్కో పద్యానికి ఒక్కో బంగారు నాణెం ఇస్తానన్నావు . ఇప్పుడు వెండి ఇచ్చి చేతులు దులుపుకున్న టక్కరివి నీవు . నీ మర్యాదలు నా కొద్దు . నీలాంటివాడితో మాట్లాడినా అల్లా క్షమించడు . ఈ భూమి మీద సత్యం మీద నిలబడే వాడే నిజమయిన మనిషి .

2 .
ముప్పయ్ ఏళ్ళు ఒళ్ళు హూనం చేసుకుని నీ చరితను కావ్యంగా చెక్కాను . ఇప్పుడు నా కలంలో విషాద గీతాలు రాసుకోవడానికే సిరా (అనగా ఇంగ్లీషులో ఇంక్ అని చదువుకోవలెను ) మిగిలి ఉంది . కన్నీళ్లే నాకు ప్రతిఫలంగా ఇచ్చావు . వృద్ధాప్యం మీద పడింది . శరీరం పట్టు తప్పింది . అభాగ్యుడినయిపోయాను .

Disclaimer:
ఈ పద్యాలూ , అర్థాలూ చదివి వెంటనే డిలిట్ చేయండి . దయచేసి ఎవరికీ ఫార్వర్డు చేసి భాషాద్రోహ నేరానికి పాల్పడకండి . అయినా నా మాట వినకుండా ఎవరికయినా పంపినా , మీదగ్గర అలాగే ఉన్నా పోలీసులు పట్టుకుని అరెస్టు చేస్తే నా పూచీ లేదు .తరువాత నన్నని లాభం లేదు . అంతగా తెలిసి నేరం చేయాలనిపిస్తే మీ ఇష్టం . తెలుగు తల్లి మిమ్మల్ను ఒక కంట కనిపెట్టి ఉంటుంది – సీ సీ టీ వీ కెమెరాలాగా . అందుకే రండి తలా ఒక చేయి వేద్దాం . తెలుగు పద్యానికి సమాధి కడదాం – చందాలివ్వండి .

శుభోదయం
-పమిడికాల్వ మధుసూదన్

Leave a Reply