పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై కిడారి భార్య పరమేశ్వరి నిరసన

నా భర్త హత్యకు గురై నెల రోజులు కూడా గడవలేదు
వీలైతే ధైర్యం ఇవ్వండి
ఇలాంటి వ్యాఖ్యలతో బాధపెట్టొద్దు
వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును చంపింది గోదావరి జిల్లా నుంచి నక్సలిజంలోకి వెళ్లిన ఆడపడుచని…. నక్సలిజం వైపు ఆమె ఎందుకు వెళ్లిందో ఆలోచించుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై కిడారి సర్వేశ్వరరావు భార్య పరమేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు.

విశాఖపట్నంలోని జీవీఎంసీ గాంధీ బొమ్మ వద్ద ఆందోళన చేపట్టారు. తన భర్త హత్యకు గురై నెల రోజులు కూడా గడవక ముందే ఇలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయడం తమను ఎంతో బాధకు గురి చేసిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కిడారి ఎలాంటి వ్యక్తో అందరికీ తెలుసని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో వీలైతే తమకు ధైర్యం ఇవ్వాలే కానీ, ఇలాంటి వ్యాఖ్యలతో బాధ పెట్టవద్దని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో ఈపీడీసీఎల్ డైరెక్టర్ శోభా హైమావతి, తెలుగు మహిళా సంఘం నేతలు పాల్గొని… పరమేశ్వరికి సంఘీభావం ప్రకటించారు.