పరస్పర అంగీకారంతోనే.. అత్యాచారం చేయలేదు..

పరస్పర అంగీకారంతోనే.. అత్యాచారం చేయలేదు..

గత కొన్ని నెలలుగా ‘మీ టూ’ మూమెంట్ ఇండియాలో ఎలా ప్రకంపనలు రేపుతోందో తెలిసిందే. దీని దెబ్బకు ఏకంగా కేంద్ర మంత్రి ఎంజే అక్బర్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అక్బర్ వివిధ మ్యాగజైన్లకు ఎడిటర్‌ గా పని చేసిన రోజుల్లో ఆయన పలువురిని లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆయనపై ఆరోపణలు చేసిన వాళ్లలో యుఎష్ బేస్డ్ జర్నలిస్ట్ పల్లవి గొగోయ్ కూడా ఉన్నారు. అక్బర్ తనను లైంగికంగా వేధించినట్లు.. రేప్ చేసినట్లుగా ఆమె ఆరోపించింది. ఈ ఆరోపణలపై అక్బర్ స్పందించాడు. పల్లవితో తనకు సంబంధం ఉన్న మాట వాస్తవమే అని.. పరస్పర అంగీకారంతోనే ఆ బంధం కొనసాగిందని.. అంతే తప్ప ఆమెను తాను రేప్ చేయలేదని అక్బర్ స్పష్టం చేశాడు.

పల్లవితో సంబంధం కారణంగా తన వైవాహిక జీవితంలోనూ కలతలు చెలరేగాయని.. భార్యతో తీవ్ర విభేదాలు వచ్చాయని అక్బర్ చెప్పాడు. పల్లవి ఉద్దేశపూర్వకంగానే ఇప్పుడు ఇలాంటి ఆరోపణలు చేస్తోందని అన్నాడు. మరోవైపు అక్బర్ భార్య మల్లికా జోసెఫ్ తన భర్తపై వచ్చిన ఆరోపణల్ని ఖండించడం విశేషం. పల్లవిని తన భర్త రేప్ చేశాడన్నది శుద్ధ అబద్ధమని ఆమె పేర్కొంది. 20 ఏళ్ల కిందట పల్లవి కారణంగా తమ ఇంట్లో అశాంతి చెలరేగిందని మల్లిక చెప్పింది. తన భర్త మీద తన ప్రేమను బహిరంగంగా చూపించిందని.. తన భర్తతో ఆమె సంబంధం కారణంగా తమ మొత్తం కుటుంబంలో కల్లోలం చెలరేగిందని ఆమె వెల్లడించింది. మరి స్వయంగా అక్బర్ భార్యే ఆయనకు అండగా నిలిచిన నేపథ్యంలో పల్లవి ఎలా స్పందిస్తుందో.. తదుపరి ఎలాంటి ఆరోపణలు చేస్తుందో చూడాలి.