పదకొండేళ్ల దివ్యాంగురాలిపై ఏడు నెలలుగా పైశాచికం

లిఫ్ట్‌ మ్యాన్‌ నుంచి ప్లంబర్‌, ఎలక్ట్రీషియన్‌ వరకూ అందరూ..
18 మంది అరెస్టు..
తమిళనాట కలకలం రేపిన ఘటన
నిందితుల తరఫున వాదించరాదని న్యాయవాదుల నిర్ణయం
అభం శుభం తెలియని బాలికనే జాలి లేదు. దివ్యాంగురాలనీ కనికరించలేదు. ఆమె నిస్సహాయతనే అందివచ్చిన అవకాశంగా తీసుకున్నారు. పశువాంఛ తీర్చుకోవడానికే ప్రాధాన్యమిచ్చారు. పిశాచాలకన్నా హేయంగా ప్రవర్తించారు. లిఫ్ట్‌ నడిపేవాడి నుంచి సెక్యూరిటీ గార్డుల వరకూ.. ప్లంబర్ల నుంచి ఎలక్ట్రీషియన్‌ వరకూ అపార్టుమెంట్‌లో పనిచేస్తున్న ఏకంగా 22 మంది ఈ ఘోరానికి పాల్పడ్డారు. దాదాపు ఏడు నెలలుగా సాగిన వారి రాక్షస క్రీడతో బాధిత బాలిక అనారోగ్యం పాలవడంతో ఆరాతీసిన తల్లిదండ్రులు.. చేదు నిజాలు తెలిసి గుండెలు పగిలేలా రోదించారు. వారి ఫిర్యాదుతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బాలిక గుర్తించిన 18 మందిని పోలీసులు అరెస్టు చేయగా, మరో నలుగురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

చెన్నైలోని అయినావరానికి చెందిన పారిశ్రామికవేత్తకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె వసతి గృహంలో ఉంటూ చదువుతుండగా, వినికిడిలోపం ఉన్న చిన్న కుమార్తె ఇంటివద్దే ఉంటూ ఏడో తరగతి చదువుతోంది. తొలుత లిఫ్ట్‌ ఆపరేటర్‌ రవికుమార్‌ ఈ బాలికపై కన్నేశాడు. అనంతరం మరో ఇద్దరు, ఆపై వాచ్‌మెన్‌ వరకు అందరూ బాలికపై ఏడు నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ నెల 15న బాలిక అనారోగ్యానికి గురికావడంతో దిల్లీ నుంచి వచ్చిన ఆమె సోదరి వాస్తవాలను తెలుసుకుని తల్లిదండ్రులకు విషయం చెప్పింది. వెంటనే వారు ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో వాస్తవాలు వెలుగు చూశాయి. శీతల పానీయంలో మత్తుమందు కలిపి అరవకుండా చేసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారని, అలాగే నగ్నచిత్రాలు, వీడియోలు తీసి ఎవరికైనా చెబితే వాటిని ఇతరులకు చూపెడతామంటూ బాధితురాలిని బెదిరించినట్లు తెలిసింది. బాలిక గుర్తించిన 18 మందిని పోలీసులు అరెస్టుచేసి 17 మందిని కోర్టుకు తీసుకొచ్చారు. నిందితులకు మహిళా కోర్టు ఈ నెల 31 వరకు రిమాండు విధించింది. అలాగే బాలిక వాగ్మూలాన్ని నమోదు చేసుకుంది. ఈ సందర్భంగా కోర్టు ప్రాంగణంలో కొందరు న్యాయవాదులు, మరికొందరు స్థానికులు కామాంధులపై విరుచుకుపడ్డారు. మద్రాస్‌ హైకోర్టు న్యాయవాదుల సంఘం ఈ దారుణంపై స్పందిస్తూ తమ లాయర్లు ఎవ్వరూ నిందితుల తరఫున వాదించరాదని తీర్మానించింది. ఘటనపై పోలీసులు మాట్లాడుతూ ఇందులో ఆరుగురు అత్యాచారానికి పాల్పడ్డారని, మిగిలిన వారు బాధితురాలిని లైంగిక హింసకు గురిచేశారని వివరించారు. కేసును ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నామని, అపార్టుమెంట్‌లోని సీసీ ఫుటేజ్‌ ఆధారంగా పూర్తి వివరాలు సేకరిస్తున్నామని చెప్పారు. తమిళనాట కలకలం రేపిన ఈ ఘటనపై స్పందించిన మత్స్యశాఖ మంత్రి డి.జయకుమార్‌ పాత్రధారులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.