పంబ ఉద్ధృతితో నీట మునిగిన శబరిమల ఉపాలయాలు!

  • పశ్చిమ కనుమల్లో భారీ వర్షాలు
  • పంబా నదిలో 25 అడుగుల ఎత్తున నీరు
  • మూసుకుపోయిన శబరిమల దారి

కేరళలోని పశ్చిమ కనుమల్లో కురుస్తున్న భారీ వర్షాలకు పంబానది ఉద్ధృతంగా ప్రవహిస్తుండగా, శబరిమలలోని ఉపాలయాలు నీట మునిగాయి. పంబ వద్ద నదిలో నీటిమట్టం 25 అడుగుల ఎత్తునకు చేరుకోవడంతో, కొండపైకి వెళ్లే దారి మూసుకుపోయింది. దీంతో భక్తులను కొండపైకి వెళ్లకుండా అధికారులు అడ్డుకుంటున్నారు. పంబలోని స్నాన ఘాట్లు, దాని పక్కనే ఉండే యాత్రికుల విశ్రాంతి భవనాలు, షెడ్లు తదితరాలన్నీ నీట మునిగాయి. పంబా నదికి నీరందించే కాక్కి రిజర్వాయర్, పంబా రిజర్వాయర్లు నిండుకుండలా మారాయి. ఎగువన కొండల్లో భారీ వర్షాలు కురుస్తూ ఉండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.