పంచాయితీ ఎన్నికల్లో ఓడిన ఎమ్మెల్యేల ప్రభావం

పంచాయితీ ఎన్నికల్లో ఓడిన ఎమ్మెల్యేల ప్రభావం

మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల ఓటమి ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికలపైనా స్పష్టంగా కనిపిస్తోంది. ఆ స్థానాల్లో గెలిచిన వారు మరింత ఉత్సాహంతో ముందుకెళ్తుండగా, ఓడిన వారు ఇంకా దాన్నుంచి తేరుకోలేకపోతున్నారు. గతంలో ఐదుసార్లు గెలిచిన నాయకుడిగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో తనదైన ముద్ర వేసుకున్న పంచాయతీరాజ్‌ శాఖ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా శాసన సభ ఎన్నికల్లో ఓటమి చెందారు. కాంగ్రెస్‌ నుంచి గెలిచిన భీరం హర్షవర్ధన్‌రెడ్డి రెట్టింపు ఉత్సాహంతో స్థానిక ఎన్నికల్లో ముందుకెళ్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఆధిక్యత వచ్చిన గ్రామాల్లో దృష్టి సారించి అత్యధిక సంఖ్యలో సర్పంచులను గెలిపించుకోవాలని పావులు కదుపుతున్నారు. కొల్లాపూర్‌ నియోజకవర్గంలో 40 గ్రామాల్లో టీఆర్‌ఎస్‌కు ఎదురుగాలి వీస్తుండగా, మరో 20 గ్రామాల్లో నున్వా నేనా అన్నట్టుగా ఉంది. 40 గ్రామాల్లో మాత్రం టీఆర్‌ఎస్‌ బలపర్చిన వ్యక్తులు సర్పంచులుగా గెలిచే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.

ఉమ్మడి జిల్లాలో జూపల్లి అనుచరులున్నా.. ఆయన ఓటమి నేపథ్యంలో వారంతా సర్పంచ్‌ ఎన్నికల్లో ఎటువైపు మొగ్గు చూపుతారో తెలియని స్థితి నెలకొంది.అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ ఉమ్మడి జిల్లాలో 14 శాసనసభ సభ్యులకుగాను 13 మందిని గెలిపించు కున్నప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాస్త ఆందోళనగానే ఉంది. భూ మాఫియా, ఇసుక మాఫియా, దళారీ వ్యవస్థను నడిపి కోట్ల రూపాయలు దండుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారే స్థానిక ఎన్నికల్లో సర్పంచులుగా బరిలోకి దిగుతున్నారు. దాంతో అధికార పార్టీ స్థానిక నాయకుల పట్ల ఓటర్లలో కొంత వ్యతిరేకత ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ప్రభావం స్థానిక ఎన్నికలపై ఉండే అవకాశం లేదు. అందుకే స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవ ఫార్ములాను తీసుకొస్తున్నారు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ బలపర్చిన సర్పంచ్‌ అభ్యర్థుల ను గెలిపించుకోవడానికి ఎన్ని తాయిలాలైనా వెనుకాడరా దని హుకుం జారీ చేస్తున్నారు. మాజీ మంత్రి జూపల్లి ఓడిపోవడంతో ఆయన అనుచరులు అనేకమంది రాజకీయాలకు అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం ఉంది. దీంతో ఉమ్మడి జిల్లాలో సగానికిపైగా పంచాయతీల్లో సర్పంచులుగా ఇతర పార్టీలు బలపర్చిన అభ్యర్థులే గెలిచే అవకాశాలున్నట్టు చర్చ సాగుతోంది.నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ నియోజకవర్గం నుంచి జూపల్లి ఓడిపోవడంతో ఈ జిల్లాలో టీఆర్‌ఎస్‌కు స్థానిక ఎన్నికల్లోనూ గట్టిషాక్‌ తగిలే పరిస్థితి నెలకొంది. కొల్లాపూర్‌ నియోజకవర్గంలో 16 గ్రామాలున్నాయి.

ప్రధానంగా పట్టణంలో మొదటి నుంచి జూపల్లి పట్ల వ్యతిరేకత ఉంది. ఇక మిగతా గ్రామాల్లో జూపల్లికి అనుకూల వాతావరణం ఉన్నా.. అధికారంలో ఉన్నప్పుడు ఆయన వ్యవహరించిన తీరుపట్ల వ్యతిరేకత ఏర్పడింది. అందువల్ల ఈసారి స్థానిక ఎన్నికల్లో సగానికిపైగా కాంగ్రెస్‌ బలపర్చిన అభ్యర్థులే సర్పంచులుగా గెలిచే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా మొలచింతలపల్లి, ఎల్లూరు, కుడికిల్ల వంటి గ్రామాల్లో జూపల్లి పట్ల పూర్తి వ్యతిరేకత ఉంది. చిన్నంబావి మండలంలో 11, వీపనగండ్లలో 14, పెంట్లవెల్లిలో 10, పెద్దకొత్తపల్లిలో 25, కోడేరులో 22, పాన్‌గల్‌ మండలంలో 28 గ్రామాలున్నాయి. మండల కేంద్రాలతో పాటు పెద్ద గ్రామాలు పూర్తిగా జూపల్లికి వ్యతిరేకంగా ఉన్నాయి. పెంట్లవెల్లి, మొలచింతలపల్లి, పాన్‌గల్‌ మండల పరిధిలోని పలు గ్రామాల్లో శ్రీశైలం నిర్వాసితులు అధికంగా ఉన్నారు. వీరంతా జూపల్లి గ్రామాల్లో రాకుండా కట్టడి చేశారు. ఫ్లెక్సీలు కట్టి మరీ నిరసనలు తెలిపారు. ఈ క్రమంలోనే స్థానిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి.