acp caut app

నోట్లను చించి టాయిలెట్‌లో వేసినా.. ఏసీబీకి పట్టుబడిన ఏపీపీ

లంచంగా తీసుకున్న డబ్బుతో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి  పట్టుబడతాననే భయంతో   ఓ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ)  చేసిన ట్రిక్కు బెడిసికొట్టింది . బాధితుల నుంచి తాను తీసుకున్న నోట్లను చించి వేసి టాయిలెట్‌లో వేసి నీళ్లు పోశాడు.  పసిగట్టిన ఏసీబీ అధికారులు టాయిలెట్‌కు ఉన్న డ్రైనేజీ పైప్‌లైన్‌ను తెరచి చినిగిపోయిన నోట్ల ముక్కలను వెలికితీయించారు. లంచం తీసుకున్న ఏపీపీని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రంగారెడ్డి రేంజి డీఎస్పీ సూర్యనారాయణ వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.

షకీల్ అహ్మద్ అన్సారీ షాద్‌నగర్‌లోని జూనియర్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేస్తున్నాడు.  కేశంపేట మండలం వేములనర్వాకు చెందిన రైతు ప్రభాకర్‌రెడ్డి, అమ్మ సరోజినమ్మ, అన్న బుచ్చిరెడ్డిలపై భూవివాద కేసు 2017లో నమోదైంది. వృద్ధాప్యాన్ని దృష్టిలో పెట్టుకుని, సరోజినమ్మ పేరును ఛార్జిషీటు నుంచి తొలగించారు. దీనికి ఏపీపీ అభ్యంతరం తెలిపాడు. ఆమె పేరును తొలగించడానికి వీళ్లేదంటూ డబ్బులివ్వాలంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు , ప్రభాకర్‌రెడ్డిని వేధించాడు. వారం రోజులుగా  వేధింపులు  తీవ్రమయ్యాయి. దీంతో ప్రభాకర్‌రెడ్డి ఏసీబీని ఆశ్రయించారు.