నేరచరితులను అనర్హులుగా ప్రకటించే పని మేం చేయలేం

నేరచరితులు రాజకీయాల్లోకి వచ్చి చట్టసభలకు ఎనికైతే వారిని అనర్హులుగా ప్రకటించే బాధ్యత తాము భుజాలకెత్తుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నవారు చట్టసభల్లోకి ప్రవేశించకుండా పార్లమెంటు ఏదైనా చట్టం చేస్తే బాగుంటుందని అభిప్రాయపడింది. మంగళవారం ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇందుకు సంబంధించిన కేసును విచారించింది. తాము లక్ష్మణరేఖ దాటి శాసనపరిధిలోకి అడుగుపెట్టబోమని తేల్చి చెప్పింది. నేరచరితుల సంగతి పార్లమెంటు చూసుకోవడమే సరైన మార్గమని పేర్కొన్నది. ఈలోగా అభ్యర్థులు తమ నేరచరిత్రను ఎన్నికల అఫిడవిట్‌లో పెద్ద అక్షరాల్లో తెలుపాలని సూచించింది. రాజకీయాలు నేరపూరితం కావడం వల్ల ప్రజాస్వామ్య మూలాలు దెబ్బతింటున్నాయని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వోటర్లు తగిన నిర్ణయం తీసుకునేందుకు వీలుగా ప్రతి రాజకీయపార్టీ తమ అభ్యర్థుల నేరచరితను తమతమ వెబ్‌సైట్లలో వెల్లడించాలని తెలిపింది.