నేను, రజనీకాంత్ కలిస్తే ఇక పండగే!: కమలహాసన్ కీలక వ్యాఖ్యలు

రాజకీయాల్లో దక్షిణాది సూపర్ స్టార్లు
రజనీతో కలిస్తే చాలా మందికి పండగే
ఆ దిశగా చర్చలు మాత్రం లేవన్న కమల్
కమలహాసన్, రజనీకాంత్… ఇద్దరూ దక్షిణాది చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్లే. తమిళ రాజకీయాల్లో జయలలిత మరణం తరువాత ఏర్పడిన రాజకీయ శూన్యతను పూరించాలని భావిస్తున్నవారే. ఇప్పటికే మక్కల్ నీది మయ్యమ్ పేరిట కమల్ పార్టీని ప్రకటించగా, రజనీ తన పార్టీకి తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నారు. ఇక వీరిద్దరూ కలిసి తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేస్తే?… ఇదే ప్రశ్నను ఓ న్యూస్ చానల్ కమలహాసన్ ముందుంచగా, ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

“అలా జరిగితే అది పండగే. మేమిద్దరమూ కలసి వస్తే ఎంతో మంది ఆనందిస్తారు. ఈ విషయమై చాలా జాగ్రత్తగా మేము కలసి నిర్ణయం తీసుకోవాల్సి వుంది” అని వ్యాఖ్యానించారు. అయితే, ఇప్పటివరకూ ఈ దిశగా తమ మధ్య ఎలాంటి చర్చలూ జరగలేదని కూడా అన్నారు. కాగా, కమల్ తన పార్టీ ప్రకటనకు ముందు రజనీని రహస్యంగా కలుసుకున్నారని, రాజకీయాల్లో ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకోరాదని నిర్ణయించుకున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఇక వీరిద్దరూ కలసి 1985లో చివరిగా ‘గిరఫ్తార్’ అనే హిందీ చిత్రంలో కనిపించారు. ఆ తరువాత ఇద్దరూ కలసి స్క్రీన్ ను పంచుకోలేదు. ఇదే విషయాన్ని తాజాగా ప్రస్తావించిన కమల్, తామిద్దరమూ కలసి నటించాలంటే, సినిమా నిర్మాత ఖర్చు చాలా పెరిగిపోతుందని, నిర్మాత రిస్క్ లో పడతారని, అంత ఖర్చు పెట్టే నిర్మాత ఎక్కడ దొరుకుతారని ప్రశ్నించారు.