నేను మాట్లాడడం మొదలుపెడితే తట్టుకోలేరు

భీమవరం: ఫ్యాక్షనిస్టులు నోటికొచ్చినట్టు మాట్లాడితే సైనికుడు ఉప్పెనలా పోరాడుతాడని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. తనపై వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌ చేసిన వ్యక్తిగత విమర్శలపై భీమవరంలోని నిర్మలాదేవి ఫంక్షన్‌ హాలులో బుధవారం జరిగిన కార్యకర్తల సమావేశంలో పవన్‌ దీటుగా స్పందించారు. జగన్‌ మొదలుకుని తనను తిట్టేవాళ్లంతా ఎందుకు తిడుతున్నారో ఆలోచించుకోవాలన్నారు. మార్పు తీసుకొస్తాననే భావన వారిలో ఉంది కాబట్టే తనను తిడుతున్నారని, ఇంతమంది ఒక్కడినే తిడుతున్నారంటే మనకు ఎంత బలం ఉందో అర్థం చేసుకోవాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. తిడితే భయపడతామనే భావనలో కొందరు నాయకులు ఉన్నారన్నారు. చంద్రబాబు, జగన్‌ రాజ్యాంగాన్ని రాయలేదని, అంబేడ్కర్‌ రాశారని పవన్‌ అన్నారు. విలువలతో కూడిన రాజకీయాలు చేసేందుకే తాను వచ్చానని, ఎలాంటి భాష ఉపయోగించాలో తెలిసిన వాడినన్నారు. తాను వ్యక్తిగతంగా మాట్లాడటం మొదలుపెడితే తట్టుకోలేరని, పారిపోతారని అన్నారు. అయితే, అలాంటి మాటలతో ప్రజల సమస్యలు పరిష్కారం కావన్నారు.

బయటకు రండి నేనేంటో చూపిస్తా..

జన సైనికులను ఉద్దేశించి పవన్‌ మాట్లాడుతూ.. ‘‘ఇసుక మాఫియా, కుంభకోణాలు, దోపిడీలు చేసే నాయకులకే ఇంత ధైర్యం ఉంటే ప్రజా సంక్షేమం కోసం నిలబడే నాకెంత తెగింపు ఉండాలి. దూరం నుంచి చూస్తే నేను మెతకగానే కనబడతాను. నా దగ్గరికి వస్తే తోలు తీస్తా. సమాజంలో మార్పు తీసుకొస్తాననే భయంతోనే తెదేపా, వైకాపా, భాజపా నన్ను తిడుతున్నాయి. పవన్‌ ఒంటి స్తంభం మేడ మీద కూర్చొనే వ్యక్తి కాదు.. నేల మీద నడిచే వ్యక్తి. చిన్న వయసులోనే సాయుధ పోరాటానికి సిద్ధమై వచ్చా. సినిమాల్లో డ్యాన్సులు చేసి , డైలాగులు చెప్పానని అనుకుంటున్నారేమో. బయటకు రండి నేనేంటో చూపిస్తా. వ్యక్తిగత విమర్శలు చేయాలనుకుంటే మీకంటే బలంగా చేయగలను. నా వెనుక వేల కోట్ల ఆస్తులు లేవు. ప్రజాభిమానమే తప్ప. కష్టాలను చూసి వచ్చినవాడిని కాబట్టే బాధ్యతగా ఉంటా. చిన్నప్పుడు బాడీగార్డునవుతానని చెప్పేవాడిని. ఈ రోజు నేను సమాజానికి అంగరక్షకుడిని.

రాజకీయాల్లో మానవత్వం చచ్చిపోయింది

రాజకీయాల్లో మానవత్వం చచ్చిపోయింది. మరిచిపోయిన మానవత్వం, జవాబుదారీతనాన్నిరాజకీయాల్లో తీసుకొచ్చేందుకే నేను పార్టీ పెట్టా. రాజకీయాలకు వేల కోట్లు, గూండాలు అవసరం లేదు. ఆశయం కోసం తెగించే గుణం ఉంటే చాలు. జనసేన అలాంటి ఆశయంతోనే పనిచేస్తోంది. చిత్తశుద్ధి, సదాశయం, మానవత్వం ఉండాలి. సినిమా నాకు ఇంతమంది ప్రేమాభిమానాలు ఇచ్చిందంటే అందుకు కారణం ఏదో ఉందని నాకనిపించింది. ఆ కారణం సమాజానికి తిరిగి పనిచేయడమే అని తెలుసుకున్నా. జనసైనికులకు తనను కలుసుకోవాలని ఉన్నా కొన్నిసార్లు పరిస్థితులు అనుకూలించవు. అలాంటప్పుడు తనపై ఉన్న అభిమానం, ప్రేమతో విధ్వంసం సృష్టించకుండా జాగ్రత్తగా ఉండాలి.

ఓపిక, క్రమశిక్షణ అలవర్చుకోండి

సామాన్య కుటుంబం నుంచి వచ్చిన నేనే ఈ స్థాయికి వస్తే.. బాగా చదువుకున్న మీరు ఏ స్థాయికి వెళ్లగలరో ఊహించండి. రాజకీయాలకు బలమైన క్రమశిక్షణ, ఓపిక కావాలి. ప్రతి జన సైనికుడూ వాటిని అలవర్చుకోవాలి. ఒక తరంలో మార్పు రావాలంటే 25 ఏళ్లు పడుతుంది. అందుకే నేను 25 ఏళ్లు రాజకీయాలు చేయడానికి వచ్చానని తరచూ చెబుతున్నా. ఐదేళ్లు గట్టిగా కష్టపడితే సీఎం, మంత్రి కుర్చీలో కూర్చోవచ్చు. కానీ దానివల్ల సమాజంలో మార్పురాదు. ఒక సామాజిక మార్పు తెచ్చేందుకు మరింత ప్రణాళికతో ముందుకెళ్లాలి’’ అని పవన్‌ జనసైనికులను ఉద్దేశించి మాట్లాడారు.