నేను కాంగ్రెస్ లో చేరడం ఏంటండీ! ఈసీకి ఫిర్యాదు చేసిన ప్రకాష్ రాజ్

నేను కాంగ్రెస్ లో చేరడం ఏంటండీ! ఈసీకి ఫిర్యాదు చేసిన ప్రకాష్ రాజ్

కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు
నాకు వేసే ఓటు కాంగ్రెస్ కు వేయాలంట!
ప్రకాష్ రాజ్ ఫిర్యాదు స్వీకరించిన ఎన్నికల సంఘం
గతకొంతకాలంగా సామాజిక సమస్యలపై ఎలుగెత్తుతున్న దక్షిణాది సినీ నటుడు ప్రకాష్ రాజ్ లోక్ సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న సంగతి తెలిసిందే. బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ప్రకాష్ రాజ్ ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే, ఆయనకు సోషల్ మీడియాలో కాంగ్రెస్ కార్యకర్తలు తలనొప్పిగా మారారు. బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న రిజ్వాన్ అర్షద్ తో తాను ఉన్న ఫొటోను ఉపయోగించి దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు.

తాను కాంగ్రెస్ లో చేరినట్టు ఆ ఫొటోను ఉపయోగించి పోస్టులు పెడుతున్నారని తెలిపారు. ప్రకాష్ రాజ్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారని, తనకు వేసే ఓటును కాంగ్రెస్ కే వేయాలంటూ ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ప్రకాష్ రాజ్ ఫిర్యాదును స్వీకరించిన ఈసీ వెంటనే రంగంలోకి దిగి విచారణకు ఆదేశించింది.