నేడు పోలవరానికి గ్రీన్ ట్రైబ్యునల్ బృందం.. పర్యావరణ హానిపై పరిశీలన

నేడు పోలవరానికి గ్రీన్ ట్రైబ్యునల్ బృందం.. పర్యావరణ హానిపై పరిశీలన

Share This

ప్రాజెక్టు కోసం తవ్వుతున్న మట్టివల్ల పర్యావరణానికి హాని జరుగుతోందంటూ పుల్లారావు పిటిషన్
పర్యావరణ హానిపై నేడు ఎన్‌జీటీ బృందం పరిశీలన
మట్టి తవ్వకాల ప్రాంతాన్ని పరిశీలించనున్న నిపుణుల బృందం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని పర్యావరణవేత్త పెంటపాటి పుల్లారావు జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్‌జీటీ)లో పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టులోనూ ఈ వ్యాజ్యం నడుస్తోంది. ప్రాజెక్టు కోసం తవ్వుతున్న మట్టిని ఎక్కడపడితే అక్కడ పోయడం వల్ల పర్యావరణానికి హాని జరుగుతుందని పుల్లారావు చేస్తున్న ఆరోపణల్లో నిజాలను నిగ్గుతేల్చేందుకు ఎన్‌జీటీ బృందం నేడు పోలవరంలో పర్యటించనుంది.

ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంతోపాటు మట్టి తవ్వకాలు చేపడుతున్న ప్రాంతాల్లో పర్యటించి పర్యావరణ హానికి సంబంధించి పరిశీలించనుంది. అలాగే, వాతావరణంలో మార్పులేమైనా వస్తున్నాయా? అన్న దానిని కూడా సమీక్షించనుంది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్న వ్యాజ్యానికి సంబంధించి వచ్చే నెల 10న విచారణ జరగనుంది. అప్పటికి క్షేత్ర స్థాయిలో సమగ్ర దర్యాప్తు జరిపి నివేదిక అందించాలంటూ అధికారులను నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే నేడు ఎన్‌జీటీ బృందం పోలవరంలో పర్యటించనుంది.