నేడు నవమి ఉదయం 6.28 వరకే... దశమి ఘడియల్లో రాములోరి కల్యాణానికి కారణమిదే!

నేడు నవమి ఉదయం 6.28 వరకే… దశమి ఘడియల్లో రాములోరి కల్యాణానికి కారణమిదే!

Share This

చైత్ర శుద్ధ నవమి అంటే… శ్రీరామనవమి. ఇదే రోజు శ్రీరామచంద్రుడు జన్మించాడు. ఇదే రోజు ఆయనకు సీతాదేవితో వివాహం జరిగింది. త్రేతాయుగంలో జరిగిన ఈ ఘటనను తలచుకుంటూ నేటికీ ఊరూరా స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని జరిపిస్తూ, పూజిస్తుంటాం. అయితే, కొన్నిసార్లు శ్రీరామనవమి వేడుకలపై వివాదాలు వస్తుంటాయి. ఒక్క శ్రీరామనవమి మాత్రమే కాదు. ఉగాది, దసరా తదితర పర్వదినాలను ఎప్పుడు జరుపుకోవాలన్న విషయంపైనా ప్రజలు, పండితులు విభేదిస్తుంటారు. దీపావళి విషయానికి వచ్చేవరకు రాత్రిపూట అమావాస్య ఉన్న రోజును పండుగగా జరుపుకుంటున్నా, మిగతా పర్వదినాల విషయంలో వివాదాలు వస్తూనే ఉంటాయి.

ఈ శ్రీరామనవమి విషయంలోనూ అలాగే జరిగింది. నిన్న అత్యధిక సమయంపాటు నవమి ఘడియలు ఉండటంతో కొన్ని ప్రాంతాల్లో స్వామివారి కల్యాణోత్సవాలను జరిపించడం జరిగింది. అయితే, భద్రచాలంలో మాత్రం నేడు కల్యాణం జరుగనుంది. దీనికి కారణాన్ని వెల్లడించిన ఆలయ పురోహితుడు, అష్టమితో కలిసివచ్చే నవమి ఘడియల్లో స్వామికి, అమ్మవార్లకు కల్యాణం జరిపించే ఆనవాయతీ లేదని, నిన్న ఉదయం వరకూ అష్టమి ఘడియలు ఉన్నందున నేడు జరిపిస్తున్నామని స్పష్టం చేశారు. దశమి ఎంతో మంచి రోజని, అష్టమి సూర్యోదయానికి ముందే వెళ్లిపోతే మాత్రమే ఆ రోజున కల్యాణం జరిపించాలే తప్ప, సూర్యోదయం తరువాత అష్టమి ఉంటే అదే రోజున స్వామివారి వివాహ మహోత్సవాన్ని నిర్వహించరాదని తెలిపారు.