నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై చైత్రమాస బ్రహ్మోత్సవాలు

Share This
 విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీదుర్గామల్లేశ్వర స్వామివారి చైత్రమాస కళ్యాణ బ్రహ్మోత్సవాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. ఉత్స‌వాల సంద‌ర్భంగా ఏప్రిల్ 15న గ‌జ‌వాహ‌న సేవ‌, 16న రావ‌ణవాహ‌న సేవ‌, 17న నందివాహ‌న సేవ‌, 18న సింహ‌వాహ‌న‌సేవ‌, 19న వెండిర‌థంపై స్వామి, అమ్మ‌వార్ల ఊరేగింపు నిర్వ‌హిస్తారు. అలాగే ఏప్రిల్ 17 రాత్రి గంగా పార్వ‌తీ స‌మేత మ‌ల్లేశ్వ‌ర‌స్వామివారి క‌ళ్యాణోత్స‌వం జ‌రగనుంది. సోమవారం సాయంత్రం 5 గంటలకు మల్లికార్జున మహామండపం నుంచి నగరోత్సవం ప్రారంభమవుతుంది. ఇవి తొమ్మిది రోజుల పాటు కొనసాగనున్నట్టు దుర్గగుడి ఈవో కోటేశ్వరమ్మ తెలిపారు. భద్రాచలంలో తరహాలోనే భక్త బృందాలు చేతులతో పొట్టు తీసిన బియ్యాన్ని తలంబ్రాలుగా వినియోగిస్తామని, వాటికి దేవాలయ భూముల్లో పండిన ధాన్యాన్నే వాడుతున్నామని ఆమె వెల్లడించారు. శ్రీ గంగా పార్వతీ (దుర్గా) సమేత మల్లేశ్వరస్వామివార్ల చైత్రమాస కళ్యాణ బ్రహ్మోత్సవాలను గతంలో ఎన్నడూలేనంత వైభవంగా నిర్వహించనున్నట్టు వివరించారు. ఏప్రిల్ 15 నుంచి 22 వ‌ర‌కు చైత్ర‌మాస బ్ర‌హ్మోత్స‌వాలు నిర్వ‌హిస్తారు. ఇందుకోసం ఆల‌య అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.

ఏటా ఉగాది సందర్భంగా కనకదుర్గ అమ్మవారికి స్నపన కార్యక్రమాన్ని నిర్వహించి, ఆ తర్వాత వసంత నవరాత్రి ఉత్సవాలను జరపడం ఆనవాయతీ. ఉగాది నాడు వెండి రథంపై అమ్మవారి నగరోత్సవం జరుగుతుంది. ఆ తర్వాత చైత్రమాస బ్రహ్మోత్సవాల్లో భాగంగా అమ్మవారికి తొమ్మిది రోజులు వివిధ రకాలు పుష్కాలతో అర్చన నిర్వహిస్తారు. రోజుకో రకం పూలతో పూజిస్తారు. తొలి రోజు మల్లెపూలు, రెండో రోజు పసుపు చామంతి, మూడో రోజు గులాబీ, నాలుగో రోజున కనకాంబరాలు, ఐదో రోజు మరువం, తామర పూలు, ఆరో రోజున మారేడు, జిల్లేడు పూలు, ఏడో రోజున తులసీ దళాలు, మందార పుష్పాలు, ఎనిమిదో రోజున తెలుపు చామంతి, కలువలు, తొమ్మిదో రోజున కాగడా మల్లెపూలతో అమ్మవారిని పూజిస్తారు.