నుమాయిష్‌లో భారీ అగ్ని ప్రమాదం

నుమాయిష్‌లో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌లోని చారిత్రాత్మక ఎగ్జిబిషన్ (నుమాయిష్)లో బుధవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రాత్రి 8.30 గంటలకు మొదలైన అగ్నికీలలు.. పదిన్నరవరకు కొనసాగాయి. ఈ ప్రమాదంలో దాదాపు 200 స్టాళ్లు ఆహుతయ్యాయి. కోట్ల రూపాయల్లో ఆస్తినష్టం సంభవించింది. అగ్నిమాపకశాఖ, జీహెచ్‌ఎంసీ, ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు సకాలంలో స్పందించి, పెను ముప్పును తప్పించాయి. నింగికి ఎగసిపడుతున్న మంటలను 20కిపైగా ఫైరింజన్లు శ్రమించి అర్పివేశాయి. దాదాపు 60 వాటర్‌ట్యాంకర్లు ఫైరింజన్లకు ఎప్పటికప్పుడు నీటిని సరఫరాచేశాయి. అధికారులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడం, సందర్శకులను పోలీసులు సురక్షితంగా బయటకు పంపించడంతో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. అయితే.. పొగ కారణంగా ఏడుగురు ఊపిరి ఆడక ఇబ్బందికి గురయ్యారు. వారిలో ముగ్గురిని నాంపల్లి కేర్ దవాఖానకు తరలించారని సమాచారం.

అగ్నిప్రమాదంతో నుమాయిష్‌లో వేల సంఖ్యలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఎగ్జిబిషన్‌లోని మహేశ్‌బ్యాంక్ స్టాల్‌లో చోటుచేసుకున్న విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ రాజుకున్న మంటలు క్రమంగా పక్కనే ఉన్న స్టాళ్లకు పాకాయని ప్రాథమికంగా తెలుస్తున్నది. మంటలకు గాలులు తోడవడంతో కొద్ది నిమిషాల వ్యవధిలోనే అగ్నికీలలు ఇతర స్టాళ్లను చుట్టుముట్టాయి. విషయం తెలియగానే ఘటనాస్థలానికి చేరుకున్న మేయర్ బొంతు రామ్మోహన్ అధికారులను అప్రమత్తం చేసి, ప్రమాద తీవ్రత తగ్గించేందుకు కృషిచేశారు. హోంమంత్రి మహమూద్‌అలీ, మాజీ మంత్రులు ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌లు ఘటనా స్థలానికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. ఎగ్జిబిషన్‌లో ఉత్తరప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర తదితర రాష్ర్టాలకు చెందిన వ్యాపారులు కూడా స్టాళ్లను ఏర్పాటుచేశారు. వారంతా భోజన సదుపాయంకోసం తెచ్చుకున్న గ్యాస్‌సిలిండర్లను స్టాళ్లల్లోనే ఉంచడంవల్ల ప్రమాదం తీవ్రత ఎక్కువ ఉన్నట్టు సమాచారం. అగ్నిప్రమాదం నేపథ్యంలో ఎగ్జిబిషన్‌కు ఒక్క రోజు సెలవు ప్రకటించారు.

సందర్శకులకు మెట్రో రైల్ సేవ
నుమాయిష్‌కు వచ్చిన సందర్శకులు వెంటనే ఆ ప్రాంతం వీడి వెళ్లేందుకు హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు సహకరించారు. రాత్రివరకు సందర్శకులు మెట్రోరైల్‌లో ఉచితంగా ప్రయాణంచేసే వీలు కల్పించారు. దీంతో నాంపల్లిలో ట్రాఫిక్ నియంత్రణ సులువుగా మారింది. మెట్రోస్టేషన్‌లో జనసందోహం లేకుండా నిలువరించగలిగారు.

బాధితులను ఆదుకుంటాం: మహమూద్ అలీ, హోంమంత్రి
అగ్నిప్రమాద స్థలాన్ని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ రాత్రి 11.20 గంటల సమయంలో సందర్శించారు. దగ్ధమైన స్టాళ్లను పరిశీలించారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రమాదానికి కారణాలు తెలుసుకుంటామని, పూర్తిస్థాయిలో విచారణ చేయిస్తామని చెప్పారు. భారీగా ఆస్తినష్టం జరిగినందున బాధితులకు సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

దుస్తుల కారణంగా ఎగిసిపడిన మంటలు
మహేశ్‌బ్యాంకు స్టాల్‌లో షార్ట్‌సర్క్యూట్‌తోనే మంటలు చెలరేగాయని, స్టాళ్లల్లో ఉన్న క్లాత్ కారణంగా నిమిషాల వ్యవధిలోనే పక్క స్టాళ్లకు కూడా మంటలు వ్యాపించాయని రీజనల్ ఫైర్ ఆఫీసర్ పాపయ్య చెప్పారు. పొగ కారణంగా ఫైర్ సిబ్బందితోపాటు ఒక పౌరుడు అస్వస్థత గురయ్యారని, వారిని వెంటనే దవాఖానకు తరలించామని తెలిపారు. అగ్నిప్రమాదం నష్టంపై అంచనా వేయాల్సి ఉందన్నారు.