నీతి ఆయోగ్‌లో జ‌గ‌న్ అద్భుత ప్ర‌సంగం

పూడ్చ‌లేని స్థాయిలో లోటు బ‌డ్జెట్‌తో ఉన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను ప్ర‌త్యేక హోదా ఇచ్చి ఆదుకోవాల‌ని ఏపి ముఖ్య‌మంత్రి వై ఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి నీతి ఆయోగ్ స‌మావేశంలో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీని కోరారు. అత్యంత ప్ర‌శంసాపూర్వ‌క‌మైన అభ్య‌ర్ధ‌న‌ను ఆయ‌న నీతి ఆయోగ్ ముందు ఉంచారు. 14వ ఆర్ధిక సంఘం 2015-2020 మ‌ధ్య కాలంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రెవెన్యూలోటు రూ.22,113 కోట్లు ఉంటుంద‌ని అంచ‌నా వేసింద‌ని వాస్త‌వంగా అంత‌కు మించిన రెవెన్యూలోటు ఉండ‌బోతున్న‌ద‌ని ఆయ‌న నీతి ఆయోగ్‌కు తెలిపారు. అదే స‌మయంలో తెలంగాణ రాష్ట్రానికి రూ 1,18,678 కోట్ల మిగులు ఉంటుంద‌ని ఈ వ్య‌త్యాసాన్ని స‌రిదిద్దాల్సి ఉంద‌ని వై ఎస్ కోరారు. గ‌త ఐదేళ్ల‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రెవెన్యూ లోటు రూ.66,362 కోట్లు ఉంద‌ని ఆయ‌న అన్నారు.

ఆదాయానికి అడ్డా హైద‌రాబాద్‌

హైద‌రాబాద్ దేశంలోని అన్ని ప్ర‌ధాన న‌గ‌రాల‌తో పోటీప‌డి అభివృద్ధి చెందుతున్న‌ద‌ని 2013-14 సంవ‌త్స‌రంలో ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం రూ.57,000 సాఫ్ట్‌వేర్ ఎగుమ‌తులు చేయ‌గా కేవ‌లం ఒక్క హైద‌రాబాద్ న‌గ‌రం నుంచే రూ.56,500 కోట్ల మేర‌కు సాఫ్ట్ వేర్ ఎగుమ‌తులు జ‌రిగాయ‌ని ఆయ‌న తెలిపారు. విభ‌జిత ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ఎలాంటి వ‌న‌రులు లేక‌పోగా భ‌రించ‌లేని ఆర్ధిక లోటు ఉంద‌ని ఆయ‌న అన్నారు. 2015-16 ఆర్ధిక సంవ‌త్స‌రంలో తెలంగాణ రాష్ట్ర త‌ల‌స‌రి ఆదాయం రూ.14,411 కోట్లు కాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ త‌ల‌స‌రి ఆదాయం కేవ‌లం రూ.8,397 కోట్లుగా ఉంద‌ని ఆయ‌న తెలిపారు. రాష్ట్ర విభజన నాటికి ఏపీకి రూ.97 వేల కోట్లు అప్పులు ఉన్నాయి. 2018 -19 నాటికి ఏపీ అప్పులు రూ.2లక్షల 58వేల కోట్లకు చేరాయి. ఏడాదికి రూ.20వేల కోట్ల వడ్డీ, రూ.20వేల కోట్ల అసలు చెల్లించాల్సి వస్తోంది. రాష్ట్రంలో పారిశ్రామికీకరణ లేదు. చేతివృత్తులు, ఉపాధి అవకాశాలు భారీగా తగ్గిపోయాయి. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేక యువత వలస వెళ్తోంది. రాష్ట్ర పరిస్థితిని అర్థం చేసుకొని ప్రత్యేక హోదా ఇవ్వండి. హోదా ఇస్తే రాష్ట్రం నిలదొక్కుకుంటుంది అని వై ఎస్ అన్నారు.

త‌ల‌స‌రి గ్రాంటు ఎంతో త‌క్కువ‌

ప్ర‌త్యేక హోదా ఉన్న రాష్ట్రాల‌కు త‌ల‌స‌రి గ్రాంటు రూ.5,573 ఉంటుంది కాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు కేవ‌లం రూ 3,428 మాత్ర‌మే ఉంద‌ని దీన్ని దృష్టిలో ఉంచుకుని అయినా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని ఆయ‌న కోరారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే సూప‌ర్ స్పెషాలిటీ ఆసుప‌త్రులు, ఫైవ్ స్టార్ హోట‌ళ్లు, త‌యారీ ప‌రిశ్ర‌మ‌లు, హైవాల్యూ స‌ర్వీసు ఇండ‌స్ట్రీలైన ఐటి స‌ర్వీసులు, ఉన్న‌త విద్యాల‌యాలు అవ‌స‌రం అవుతాయ‌ని ఇవ‌న్నీ నెల‌కొల్పాలంటే ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని ఆయ‌న నీతి ఆయోగ్‌ను కోరారు. 14వ ఆర్ధిక సంఘం ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌ద్ద‌ని చెప్పిన‌ట్లు అంటున్నార‌ని అయితే అలాంటిదేం లేద‌ని 14వ ఆర్ధిక సంఘం స‌భ్యుడు అభిజిత్‌సేన్ చెప్పిన విష‌యాన్ని నీతిఆయోగ్ దృష్టికి తీసుకువ‌స్తున్నానని ఆయ‌న అన్నారు. అదే విధంగా 2014 మార్చి 2న జ‌రిగిన కేంద్ర మంత్రి వ‌ర్గ స‌మావేశంకూడా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా ఇచ్చేందుకు అంగీక‌రించింద‌ని వై ఎస్ తెలిపారు.

రాజ‌ధాని ఉన్న ప్రాంతం ప్ర‌త్యేక రాష్ట్రం కోరిన సంద‌ర్భం

మొట్ట మొద‌టి సారి రాజ‌ధాని ఉన్న ప్రాంతం ప్ర‌త్యేక రాష్ట్రం కావాల‌ని కోరింద‌ని, దానికి కేంద్రం అంగీక‌రించింద‌ని ఆ విధంగా రాజ‌ధాని లేని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఏర్ప‌డింద‌ని ఆయ‌న తెలిపారు. ఈ ద‌శ‌లోనే ప్ర‌త్యేక హోదా హామీ ఇచ్చార‌ని ఆయ‌న గుర్తు చేశారు. అందువ‌ల్ల ప్ర‌త్యేక హోదా ఇచ్చి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను ఆదుకోవాల‌ని ఆయ‌న కోరారు. నీతి ఆయోగ్‌ పాలకమండలి సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఏపీకి ప్రత్యేక హోదా ఆవశ్యకతపై నివేదిక సమర్పించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రధాని నరేంద్ర మోడీ, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ముందుంచారు. రెవెన్యూ లోటు భర్తీ, ప్రత్యేక హోదా ఆవశ్యకతను ఈ కీలక భేటీలో విన్పించారు. అలాగే, అధికారులందరికీ ఎనిమిది పేజీల లేఖను అందజేశారు. దాంతో పాటు 48 పేజీల నివేదికను కూడా నీతి ఆయోగ్‌ సమావేశంలో పాల్గొన్న సభ్యులందరికీ జగన్‌ అందజేశారు.