నాదెండ్ల మరో యుద్ధానికి సిద్ధం అవుతున్నారా?

{ఇలపావులూరి మురళీమోహన్ రావు}

విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి 84 ఏళ్లవృద్ధ నాయకుడు, నెలరోజుల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు మరో నాలుగైదు రోజుల తరువాత జూలు విదల్చబోతున్నారు. క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగత జీవితంతో నేటికీ, సంపూర్ణ ఆరోగ్యభాగ్యాన్ని అనుభవిస్తున్న నాదెండ్ల భాస్కర్ రావు, చంద్రబాబు పై యుద్ధానికి సన్నద్ధం అవుతున్నట్లు తెలుస్తున్నది., ఏ పార్టీలోనూ చేరకుండా, జిల్లా కేంద్రాలలో పత్రికసమావేశాలు నిర్వహిస్తూ ఎన్టీఆర్, చంద్రబాబుల నిజస్వరూపాన్ని బయటపెడుతూ, చంద్రబాబును గద్దె దించడమే లక్ష్యంగా ఆయన సన్నద్ధం అవుతున్నట్లు నమ్మకస్తులు తెలియజేస్తున్నారు. తనను వెన్నుపోటుదారుడుగా చిత్రీకరించి, తాము స్థాపించిన తెలుగుదేశం పార్టీని కబ్జా చేసిన చంద్రబాబు మీద పగ తీర్చుకోవడానికి ఉద్యుక్తులు అవుతున్నారట!

పాపం నాదెండ్ల!

పూర్వం ఒక గ్రామంలో కృతవర్మ అనే క్షత్తియ్ర యువకుడు ఉండేవాడు. అతను రాజవంశీకుడు. ముత్తాతలనాటి రాజ్యాలు పోవడంతో, అతను ఒక చిన్న ఇంట్లో ఉంటూ తనకు వచ్చిన కర్రసాము, కత్తిసాములను పిల్లలకు నేర్పుతూ కాలం గడుపుతున్నాడు.

ఒకసారి కృతవర్మ పొరుగు గ్రామంలో తిరునాళ్ల జరుగుతుంటే వెళ్ళాడు. అక్కడ ఒకచోట పురావస్తు ప్రదర్శనశాల కనిపిస్తే వెళ్ళాడు., అక్కడి యజమాని కృతవర్మను స్వాగతించి అతని వంశం, పూర్వీకులగూర్చి తెలుసుకుని గదిలోపలకు తీసుకెళ్లి గోడకు వేలాడుతున్న పెద్ద తైలవర్ణచిత్రాన్ని చూపించి ఈయన రామకృష్ణవర్మ. మీ వంశంలోని అయిదు తరాలకు వెనుక జన్మించి ఈ రాజ్యాన్ని పరిపాలించిన రాజు. ఖడ్గం చేపట్టి యుద్ధంలోకి దిగితే వెయ్యి తలలు నరికితే కానీ, కత్తి దించడని ప్రతీతి. దీన్ని అమ్మకానికి పెట్టాను. వెయ్యి వరహాలు మాత్రమే” అని చెప్పాడు.

దురదృష్టం కొద్దీ కృతవర్మ దగ్గర 970 వరహాలు మాత్రమే ఉన్నాయి. ధరను తగ్గించడానికి యజమాని అంగీకరించకపోవడంతో నిరాశగా వెనక్కి వెళ్ళాడు.

పదిరోజుల తరువాత రాజధానికి పనిమీద వెళ్లిన కృతవర్మ తన మిత్రుడు రాజవర్మ ఇంటికి వెళ్ళాడు. అక్కడ గోడ మీద తిరునాళ్లలో తాను చూసిన వర్ణచిత్రం కనిపించింది. “ఈ చిత్రం…?” కుతూహలంగా ప్రశ్నించాడు.

రాజవర్మ గర్వంగా నవ్వి “ఈయన మాకు అయిదు తరాలకు పూర్వం ఈ రాజ్యాన్ని పాలించిన మా పూర్వికులు. యుద్ధంలోకి దిగి కత్తి ఎత్తితే వెయ్యి తలలు నరికిన తరువాతే దించేవాడు అని ప్రతీతి…మొన్న ఒక సంతలో దీన్ని కొన్నాను” అని చెప్పాడు మీసాలు మెలిదిప్పుతూ.

కృతవర్మ నిట్టూర్చి “హు…ముప్ఫయి వరహాలు తక్కువ అయ్యాయి కానీ, లేకపోతె ఆయన మా పూర్వీకుడు అయ్యుండేవాడు” అన్నాడు.

 

నాదెండ్ల భాస్కర్ రావు ఎన్టీఆర్ మీద తిరుగుబాటు చేసాడు…కానీ, పత్రికల కులగజ్జిని వాడుకోవడం చేతకాని అసమర్ధుడు. పత్రికాధిపతులకు వందల ఎకరాల భూములు కట్టబెట్ట్టి యజమానులు తన గడపలో కుక్కల్లా కట్టేసుకోవడం చేతకాని వాడు. ముందుగా ఆయన ఆ పని చేసి, ఎన్టీఆర్ ను కూలదోసి ఉన్నట్లయితే.. ఎన్టీఆర్ ఉక్కు పిడికిలి నుంచి .ప్రజాస్వామ్యాన్ని కాపాడిన వీరుడు అనిపించుకునేవాడు.

నాదెండ్లను గౌరవించి, ఆయనకు విలువ ఇచ్చినట్లయితే ఎన్టీఆర్ పరిస్థితి మరోలా ఉండేదేమో? ఆయనను ద్రోహి అన్న ఎన్టీఆర్…అసలైన ద్రోహి అల్లుడి రూపంలో ఉన్న సంగతి తెలియక చివరకు పగవారికి కూడా రాకూడదని కోరుకునే మరణాన్ని పొందటం విషాదకరం కదా!