నాకు సలహాలివ్వండి... 91996 91996కి ఫోన్ చేయండి... ఉద్యోగులకు వైఎస్ జగన్ లేఖలు!

నాకు సలహాలివ్వండి… 91996 91996కి ఫోన్ చేయండి… ఉద్యోగులకు వైఎస్ జగన్ లేఖలు!

మరో మూడు నెలల్లో సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ, ఏపీ విపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్, రాష్ట్రంలోని ఉద్యోగులకు స్వయంగా లేఖలు రాస్తూ, రాష్ట్ర ప్రగతికి సలహాలు ఇవ్వాలని కోరుతున్నారు. గత రెండు రోజులుగా, ఉద్యోగి పేరిట, వైఎస్ జగన్ సంతకంతో ఈ లేఖలు ఉద్యోగులకు అందుతున్నాయి. వీటిపై పార్టీ గుర్తు అయిన ఫ్యాన్, జగన్ ఫోటోలు కూడా ఉన్నాయి. లేఖ సారాంశం ఏంటంటే…

నమస్కారం (ఆ పక్కనే ఉద్యోగి పేరు)
మీరు చేస్తున్న కృషిని ప్రశంసిస్తూ మిమ్మల్ని కలిసి ఏపీ ప్రగతికి మీ సలహాలు తీసుకోవాలని ఆశిస్తున్నాను. నేను మీ వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డిని.
ఉభయకుశలోపరి, మీరు ఉద్యోగి అని తెలుసుకున్నాను. మీ ద్వారా గ్రామస్తులు ప్రయోజనం పొందడానికి కృషి చేస్తున్నందుకు నా అభినందనలు. మీరు ఇదేవిధంగా తోటి వారికి సహాయం చేస్తూ మరిన్ని పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని కోరుకుంటున్నాను.

ఏపీకి పూర్వ వైభవం తీసుకురావడానికి రాష్ట్ర ప్రజలంతా స్వచ్ఛందంగా ముందుకొచ్చి రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉంది. 429 రోజులు నేను చేసిన పాదయాత్రలో మీ గుండెచప్పుడు విని నా గుండె చప్పుడుగా మార్చుకున్నాను. పాదయాత్రలో భాగంగా మీలాంటి ఎంతో మంది స్ఫూర్తిదాయకమైన వ్యక్తులను కలుసుకోవడం నా అదృష్టం. ఏపీ ప్రగతి కోసం నేను రూపుదిద్దే కార్యాచరణ కోసం మీ విలువైన సలహాలు, సూచనలు తెలుసుకోవాలనుకుంటున్నాను. నన్ను కలవడానికి 91996 91996 ఫోను నెంబరుకు సంప్రదించండి.
ఇట్లు
మీ
వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డి.