నవ వధువు ఆత్మహత్య

వివాహమైన రెండు రోజులకే నవ వధువు విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఆమెతో పాటు విషం తాగిన చిన్నాన్న పరిస్థితి విషమంగా ఉంది. తేని జిల్లా చిన్నమనూరు సమీపం పులికుత్తి గ్రామానికి చెందిన పాండియన్‌ (46) కూలీ. అతని కుమార్తె రమ్య (23). ఈమెకు పెరియకులం సమీపం సరత్తుపట్టికి చెందిన రంగరాజ్‌ (29)తో 11వ తేదీ వివాహమైంది. సోమవారం మరవలి కోసం పులికుత్తికి దంపతులు వచ్చారు. తరువాత పులికుత్తిలో ఉన్న బంధువు ఇంటికి విందుకు వెళ్లారు.

వధువు వెంట ఆమె చిన్నాన్న ముత్తుకృష్ణన్‌ (27) వెళ్లాడు. తరువాత కొద్ది సమయానికే ముత్తుకృష్ణన్, రమ్య స్పృహతప్పారు. బంధువులు వారిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు ఇద్దరూ విషం తాగినట్టు తెలిపారు. చికిత్స పొందుతూ రమ్య మృతి చెందగా ముత్తుకృష్ణన్‌ను మెరుగైన చికిత్స కోసం మదురై ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. రమ్య ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. ఈ సంఘటనపై చిన్నమనూరు పోలీసుస్టేషన్‌లో రమ్య తండ్రి పాండియన్‌ ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.