ద్రవిడ దిగ్గజం శకం సమాప్తం

 • తుదిశ్వాస విడిచిన కరుణానిధి
 • ఏడు దశాబ్దాలపాటు రాజకీయాల్లో కీలకపాత్ర
 • రాష్ట్రపతి, ప్రధాని, కేసీఆర్‌ దిగ్భ్రాంతి
 • నేడు జాతీయ సంతాపదినం
 • అంత్యక్రియల ప్రదేశంపై వివాదం
 • మెరీనా బీచ్‌కు నో అన్న ప్రభుత్వం
 • అర్ధరాత్రి దాటినా హైడ్రామా
 • నేను విశ్రాంతికే విశ్రాంతినిస్తా!
 • నా విశ్రాంత జీవితం ఎప్పుడు మొదలవుతుందో నాకే తెలియదు. క్రియాశీల రాజకీయాల
 • నుంచి నేను విరమించుకునేది లేదు…
 • ఆయన అన్నమాట నిలబెట్టుకున్నారు!
 • ద్రవిడ వాదం నినాదంగా.. హేతువాదం పునాదిగా..
 • దక్షిణాదిన ఎలుగెత్తి ద్రావిడ జెండా ఎగరేసిన ఉద్యమ సూరీడు..
 • సుదీర్ఘ రాజకీయానుభవ ప్రతిభా సంపన్నుడు..
 • తమిళ సాహితీ సాంస్కృతిక రంగాల్లో అసమాన సృజనశీలి..
 • ప్రత్యర్ధులెవరైనా లెక్క చేయకుండా ఎదురొడ్డి ఢీకొట్టిన వ్యూహచతురతా చాణక్యుడు…

కలైంజ్ఞర్‌ కరుణానిధి…
తుదకంటా క్రియాశీల రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తూనే… 94 ఏళ్ల నిండు వయసులో కన్నుమూశారు. ఆయన అస్తమయంతో దేశ రాజకీయాల్లో ఒక తరం వెళ్లిపోయింది. తమిళనాట నలుచెరగులా ఆయనకు ప్రభ కట్టిన అభిమానుల హృదయాలు చిన్నబోయాయి. డీఎంకే అధినేతగా అర్థశతాబ్దంపైగా విస్తరించిన తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో 13 దఫాలు ఎమ్మెల్యేగా గెలిచి, 5 సార్లు ముఖ్యమంత్రిగా సేవలందించిన కరుణానిధి.. తన జీవితంలో ఎన్నడూ, ఏ ఎన్నికలోనూ ఓటమి అనేదే చూడలేదు! కళలకూ రాజకీయాలకూ మధ్య అరుదైన అద్భుత వారధిగా నిలిచిన కరుణానిధి అస్తమయంతో ఒక యుగం నిలిచింది.. ఒక శకం ముగిసింది!!

బహుముఖ ప్రజ్ఞాశాలి, సినీ, రాజకీయ రంగాల్లో చెరగని ముద్ర వేసిన ధీశాలి, తమిళ ప్రజల పక్షాన నిలిచిన పోరాట యోధుడు, రాష్ట్రంతోపాటు జాతీయ రాజకీయాలపై తనదైన ముద్ర వేసిన ధ్రువతార దివికేగింది. ఐదుసార్లు ముఖ్యమంత్రిగా, 13 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా, ఓటమెరుగని నేతగా, ఒకే పార్టీకి 50 సంవత్సరాలు అధ్యక్షుడిగా కొనసాగి రాజకీయ భీష్ముడిగా పేరుగాంచిన మేరునగధీరుడు, డీఎంకే అధినేత ఎం కరుణానిధి (94) మంగళవారం కన్నుమూశారు. 15 రోజులుగా అనారోగ్యంపై చేసిన పోరాటంలో ఓడిపోయి సాయంత్రం 6.10 గంటలకు మరణించారు. ‘డాక్టర్ల బృందం ఎన్ని ప్రయత్నాలు చేసినా, నిరంతరం వైద్య సేవలందించినా కలైంజర్‌ను కాపాడుకోలేకపోయాం. ఆయన మరణాన్ని ఎంతో ఆవేదనతో ప్రకటిస్తున్నాం. సాయంత్రం 6.10 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు’ అని కావేరి ఆసుపత్రి యాజమాన్యం రాత్రి 6.40 గంటల సమయంలో వెల్లడించింది. దీంతో తమిళనాడు విషాద సంద్రమైంది. కార్యకర్తలు బోరున విలపించారు. రాష్ట్రపతి, ప్రధానిసహా జాతి యావత్తూ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గత నెల 27 అర్ధరాత్రి దాటిన తర్వాత కావేరి ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తున్న క్రమంలో రెండు సార్లు ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్సలు కొనసాగుతూ వచ్చాయి. వయసురీత్యా కాలేయం బాగా దెబ్బతినడంతో కాలేయ వైద్య నిపుణుడు డాక్టర్‌ ఎం.రేలా పర్యవేక్షణలో వైద్యం కొనసాగించినప్పటికీ మరోసారి సోమవారం పరిస్థితి విషమించింది. సోమవారం సాయంత్రం ఆసుపత్రి వర్గాలు విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌లో వయసురీత్యా కరుణానిధి అవయవాలను సక్రమంగా పనిచేయించడం సవాలుగా మారిందని, రానున్న 24 గంటలు ఆయన శరీరం సహకరించే దాన్ని బట్టి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయగలమని వైద్యులు ప్రకటించారు. దీంతో ఆసుపత్రి ఆవరణలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మంగళవారం ఆయన పరిస్థితి విషమంగానే ఉండటంతో కుటుంబ సభ్యులు, పెద్ద సంఖ్యలో అభిమానులు, డీఎంకే నాయకులు, కార్యకర్తలు ఆసుపత్రి వద్దకు చేరుకోవడం ప్రారంభించారు. వీరిలో స్టాలిన్‌, అళగిరి, కనిమొళి, డీఎంకే ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి, టీఎంసీ అధ్యక్షుడు జీకే వాసన్‌, కాంగ్రెస్‌ నేత ఈవీఎస్‌కే ఇళంగోవన్‌, ఎండీఎంకే నేత వైగో తదితరులున్నారు. కరుణానిధి కుటుంబ సభ్యులు కొందరు రోదిస్తూ లోనికి వెళ్లడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. చివరకు ఆయన మరణించినట్లు తెలియడంతో తమిళనాడు గుండె పగిలింది.

కరుణగా మారిన దక్షిణామూర్తి …
1924 జూన్‌ 3న అప్పటి తంజావూరు జిల్లా తిరుక్కువళైలో ముత్తువేల్‌, అంజుగం దంపతులకు కరుణానిధి జన్మించారు. ఆయనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు దక్షిణామూర్తి. 14 ఏళ్ల వయసులోనే జస్టిస్‌ పార్టీలో చేరి హిందీ వ్యతిరేకోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. చిన్నతనం నుంచే కరుణానిధికి సాహిత్యం, నాటక రంగంపై ఆసక్తి ఏర్పడింది. పలు నాటకాలు, కథానికలు, పుస్తకాలు రాశారు. 1957 శాసనసభ ఎన్నికల్లో తొలిసారిగా కుళితలై నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచిన ఆయన ఆ తర్వాత పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లోనూ గెలిచారు. 13 శాసనసభ ఎన్నికల్లో ఓటమెరగని నాయకుడిగా రికార్డు సృష్టించారు. 1984 ఎన్నికల్లో మాత్రం పోటీ చేయలేదు. 1969లో తొలిసారి ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేసిన ఆయన 1971, 1989, 1996, 2006 ఎన్నికల్లోనూ గెలిచి అధికార పగ్గాలు చేపట్టారు.

రాష్ట్రమంతటా హైఅలర్ట్‌
కరుణానిధి ఆరోగ్యం విషమిస్తోందన్న సమాచారం నేపథ్యంలో మంగళవారం ఆసుపత్రి వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు. ఆ శాఖ ఉన్నతాధికారులు భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. మంగళవారం సాయంత్రం 4.30కి ఆసుపత్రి నుంచి ప్రకటన వెలువడింది. కరుణానిధి ఆరోగ్యం అత్యంత విషమంగా మారిందని అందులో పేర్కొనడంతో రాష్ట్రవ్యాప్తంగా విషాదఛాయలు అలుముకున్నాయి. డీఎంకే కార్యకర్తలు, కరుణానిధి అభిమానుల గుండెలు బరువెక్కాయి. ఈ పరిణామాల మధ్యనే కరుణానిధి తుది శ్వాస విడిచారు. దీంతో వారందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సెలవుల్లో ఉన్న పోలీసులను రద్దు చేసుకుని రావాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

నేడు దేశవ్యాప్త సంతాపదినం
కరుణానిధి మృతికి సంతాపసూచకంగా బుధవారం దేశవ్యాప్తంగా సంతాప దినంగా పాటించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. దేశ రాజధాని దిల్లీతోపాటు అన్ని రాష్ట్ర రాజధానుల్లో జాతీయ జెండాను అవనతం చేయనున్నట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. తమిళనాడు ప్రభుత్వం బుధవారాన్ని సెలవు దినంగా ప్రకటించింది. సినిమా షూటింగ్‌లను రద్దు చేశారు.

రాజాజీ హాలులో పార్థివదేహం
కరుణానిధి పార్థివ దేహాన్ని బుధవారం తెల్లవారుజామున 4 గంటల నుంచి ప్రభుత్వ ఎస్టేట్‌లోని రాజాజీ హాలులో నేతలు, అభిమానుల సందర్శనార్థం ఉంచారు. తొలుత ఆసుపత్రి నుంచి ఆయన పార్దీవ దేహాన్ని గోపాలపురంలోని ఆయన ఇంటికి మంగళవారం రాత్రి తరలించారు. పశ్చిమ్‌ బంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ పార్దీవ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అర్థరాత్రి ఒంటి గంట వరకూ అక్కడే కుటుంబ సభ్యులు, బంధువులు నివాళులర్పించారు. అక్కడి నుంచి సీఐటీ కాలనీలోని కనిమొళి నివాసానికి తరలించారు. అక్కడా కుటుంబ సభ్యులు నివాళులర్పించాక రాజాజీ హాలుకు తరలించారు. గతంలో జయలలిత పార్దీవ దేహాన్నీ రాజాజీ హాలులోనే ప్రజలు, నేతల సందర్శనార్థం ఉంచారు.