తెలుగు రాష్ట్రాల్లో కనిపించని 2 వేల నోటు!

తెలుగు రాష్ట్రాల్లో కనిపించని 2 వేల నోటు!

ఏటీఎంలలో రూ. 500, రూ. 100 నోట్లే
ఎన్నికల కారణంగానే షార్టేజ్
పెద్ద నోట్లను దాచేస్తున్న అభ్యర్థులు!
తెలంగాణలో లోక్ సభ ఎన్నికలకు, ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు రోజులు దగ్గరకు వచ్చే కొద్దీ, 2 వేల రూపాయల నోట్లు మాయం అవుతున్నాయి. ఇప్పటికే ఏటీఎంలలో డబ్బు విత్ డ్రా చేసుకునేందుకు వెళితే రూ. 500, రూ. 200, రూ. 100 నోట్లు తప్ప, రూ. 2 వేల నోటు బయటకు రావట్లేదు. రాజకీయ పార్టీల నేతలు, ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారు 2 వేల నోట్లను దాచారని, అందువల్లే పెద్ద నోటుకు కొరత ఏర్పడిందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. హైదరాబాద్ లోని ఏటీఎంలలో పెద్ద నోట్లు ఏ మాత్రమూ కనిపించడం లేదు. ఇక పోలీసులకు పట్టుబడుతున్న డబ్బులో అత్యధికం ఈ పెద్ద నోట్లే ఉంటున్నాయి.

గత సంవత్సరం మార్చిలో దేశంలో చలామణిలో ఉన్న కరెన్సీలో సగానికి పైగా ఉన్న రూ. 2 వేల నోట్లు, ఈ సంవత్సరం మార్చికి వచ్చే సరికి 37.3 శాతానికి తగ్గింది. ఆర్బీఐ వెల్లడించిన డేటా ప్రకారం మార్చి 2017 నాటికి మొత్తం 3,285 మిలియన్లు, మార్చి 2018 నాటికి 3,363 మిలియన్ల రూ. 2 వేల నోట్లు చెలామణిలో ఉన్నాయి.

ఇక ఈ నెల ఆరంభంలో వేతనాలను తమ బ్యాంకు ఖాతాల్లో పొందిన ఉద్యోగులు, తొలివారంలో డబ్బు విత్ డ్రా చేసుకునేందుకు ఏటీఎంలకు వెళితే, రూ. 500 నోట్లు మాత్రమే పలకరించాయి. “నేను బిల్లులు చెల్లించాలని భావించి రూ. 4 వేలు విత్ డ్రా చేస్తే, 40 100 రూపాయల నోట్లు వచ్చాయి” అని నేరేడ్ మెట్ కు చెందిన బీ సునీత వెల్లడించారు. 2 వేల నోటుకు కొరత ఏర్పడిందని బ్యాంకు అధికారులే అంగీకరిస్తుండటం గమనార్హం.

“గడచిన మూడు నెలలుగా డిపాజిట్ల రూపంలో రూ. 2 వేల నోట్లు బ్యాంకులకు రావడం లేదు. ఆర్బీఐ నుంచి కూడా సరఫరా లేకపోవడంతోనే షార్టేజ్ ఏర్పడింది. ఎన్నికలు ముగిసిన తరువాత పరిస్థితి అదుపులోకి వస్తుందని భావిస్తున్నాం” అని ఆంధ్రా బ్యాంక్ ఎంప్లాయిస్ యూనియన్ కార్యదర్శి కొండల్ రావు వ్యాఖ్యానించారు.