తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. పంచాయతీ కార్యదర్శుల నోటిఫికేషన్!

తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. పంచాయతీ కార్యదర్శుల నోటిఫికేషన్!

రాష్ట్రంలోని నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తాజాగా ఆమోదించిన కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం తొలి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 9,355 పంచాయతీ కార్యదర్శి పోస్టులకు ప్రభుత్వం గురువారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. వచ్చే నెల మూడో తేదీ నుంచి 11వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. కాగా, కొత్త జోనల్ వ్యవస్థ అమల్లోకి రావడంతో ఇప్పటి వరకు ప్రక్రియ ప్రారంభించని, పరీక్షలు నిర్వహించకుండా ప్రాసెస్‌లో ఉన్న నోటిఫికేషన్లు రద్దు చేయనున్నారు. తిరిగి కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. ఫలితంగా స్థానిక యువతకు ఎక్కువ ప్రయోజనం కలగనుంది.

మరోవైపు, మరో 20 వేల పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇందులో 95 శాతం పోస్టులు స్థానిక యవతకే దక్కనున్నాయి. వీటితోపాటు మరో 200 గ్రూప్-1 పోస్టులు, టీఎస్‌పీఎస్సీలో 5200 పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్ రానున్నట్టు తెలుస్తోంది. పాత జోనల్ వ్యవస్థలో జిల్లా స్థాయి పోస్టుల్లో 80 శాతాన్ని స్థానికులతో భర్తీ చేస్తుండగా, కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం.. ఇకపై ఇది 95 శాతానికి మారనుంది. దీంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.