తెలంగాణ కోసం మళ్లీ త్యాగం

అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం మంచి వృద్ధిరేటును సాధిస్తున్నదని ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చెప్పారు. రాష్ట్రం సాధిస్తున్న ప్రగతిని చూసి ప్రతిపక్షాలు తట్టుకోలేకపోతున్నాయని అన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఎన్నో ఇబ్బందికర పరిస్థితుల నుంచి బయటపడ్డామన్న కేసీఆర్.. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ప్రతిపక్షాలు విచ్చలవిడి ఆరోపణలు చేస్తున్నాయని, ఇలాంటి ఆరోపణలతో తెలంగాణ అభివృద్ధి ఆగుతుందని, అధికారులను ఇబ్బందుల్లో పడేస్తాయని చెప్పారు. రాష్ట్ర ప్రగతిచక్రం ఆగొద్దని, అభివృద్ధి, ఆర్థిక పెరుగుదల ఆగకూడదనే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నామని స్పష్టంచేశారు. గురువారం అసెంబ్లీ రద్దుచేస్తూ మంత్రివర్గం చేసిన తీర్మానాన్ని గవర్నర్‌కు అందజేసిన అనంతరం తెలంగాణభవన్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడారు.
అసెంబ్లీ రద్దుకు నిర్ణయం తీసుకోవటానికి దారితీసిన పరిస్థితులను వివరించారు. కొన్నిరోజులుగా రాష్ట్రంలో రాజకీయపరంగా అధ్వాన్న పరిస్థితులు నెలకొన్నాయి. అతి ప్రవర్తన, అసహన ప్రవర్తన చూస్తున్నాం. ఇది ఏ రకంగానూ వాంఛనీయం కాదు. ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ మరింత విచ్చలవిడి ఆరోపణలు చేస్తున్నారు. ఇలాంటి ఆరోపణలతో తెలంగాణ వృద్ధికి బ్రేక్ పడుతుంది. అధికారులను ఇబ్బందిలో పడేస్తుంది. రాష్ట్రంలో అభివృద్ధి, ఆర్థిక పెరుగుదల ఆగకూడదని ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాం అని సీఎం కేసీఆర్ వెల్లడించారు. తాము ఏనాడూ పదవులకోసం లాలూచీ పడలేదని, మంత్రులను మార్చి పిచ్చిపిచ్చి పనులు చేయలేదని చెప్పారు.

ఇప్పుడు ఇంకొన్ని మాసాల సమయం ఉన్నప్పటికీ.. తెలంగాణ అభివృద్ధి కోసం నిర్ణయం తీసుకుంటున్నామని స్పష్టంచేశారు. మొదట్నుంచీ టీఆర్‌ఎస్‌కు త్యాగాలు కొత్తేమీ కాదని, పదవులను తృణప్రాయంగా వదిలేసిన చరిత్ర ఉందని కేసీఆర్ గుర్తుచేశారు. ప్రస్తుతం అభివృద్ధికోసం తీసుకున్న ఈ నిర్ణయానికి శాసనసభ్యులు, మంత్రులు, ఎంపీలందరూ సహకరించారని చెప్పారు. ముందస్తు నిర్ణయానికి ఒక్కరంటే ఒక్కరు కూడా అభ్యంతరం చెప్పలేదంటూ సహచర మంత్రులు, శాసనసభ్యులకు సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ప్రతి పనికి అడ్డుగా మారడం, నిరాధారమైన ఆరోపణలు చేయడం ప్రతిపక్షాలకు పనిగా మారిందని సీఎం విమర్శించారు.

తెలంగాణ ప్రగతికి సర్వత్రా అభినందనలు
ఆరు దశాబ్దాల ఎదురుచూపు తర్వాత తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నామని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. తొలినాళ్లలోనే టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా అనేక రకాల పొత్తులున్నప్పటికీ.. టీఆర్‌ఎస్ పార్టీగా రాష్ట్ర కార్యవర్గం బాధ్యతాయుతంగా ముందుకు సాగిందని, పటిష్ఠంగా అడుగుపడాలనే ఆలోచనతో ఒంటరిగా, స్వతంత్రంగానే ఎన్నికలకు వెళ్లామని వివరించారు. ప్రజల ఆశీర్వాదం ఉండటంతో టీఆర్‌ఎస్‌కు స్పష్టమైన మెజార్టీ లభించిందని, దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసుకున్నామని చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత ఐదారు నెలలు గందరగోళ, అయోమయ పరిస్థితులను ఎదుర్కొన్నామని సీఎం గుర్తుచేశారు. అధికారుల కేటాయింపు పూర్తికాలేదని, ఆర్థికపరమైన ప్రాతిపదిక లేక, అయోమయ పరిస్థితుల మధ్య ప్రస్థానాన్ని మొదలుపెట్టామని తెలిపారు. కొత్త రాష్ట్రంలో సాధించిన ప్రగతి, సంక్షేమాన్ని దేశ ప్రధాని, కేంద్ర మంత్రులతోపాటు అనేక రాష్ర్టాల ముఖ్యమంత్రులు, మంత్రులు అనేక సందర్భాల్లో కొనియాడారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రెండ్రోజుల క్రితం ఎకనామిక్ టైమ్స్ పత్రిక ప్రతిష్ఠాత్మక అవార్డును కూడా ప్రకటించిందని చెప్పారు.
అదేవిధంగా గత నాలుగేండ్లలో 17.17% వృద్ధిరేటును తెలంగాణ సాధించిందన్న కేసీఆర్.. ఇవి ఆషామాషీ లెక్కలుకావని, కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించిన లెక్కలని వివరించారు. కాగ్ నివేదిక తర్వాత లెక్కలన్నీ కాచివడపోసి ఈ ఆర్థిక వృద్ధిరేటును బహిర్గతం చేశారన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం గడిచిన ఐదు నెలల్లో 21.96% ఆర్థిక ప్రగతిని సాధించామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. రాష్ట్ర సొంత ఆర్థిక ఆదాయం ఎదుగుదలను దేశంలో మనమే సాధించామని, దేశంలో ఇంత వృద్ధిరేటును సాధించింది మన రాష్ట్రమేనని చెప్పారు. పలు రాష్ర్టాలు 10 లోపు, చాలా రాష్ర్టాలు సింగిల్ డిజిట్‌లోనే ఉన్నాయని తెలిపారు.

రోజంతా కరంటిచ్చారా?
టీడీపీ, కాంగ్రెస్ పాలనలో కరంట్ కోతలతో అందరం భయపడ్డామని, బాధపడ్డామని సీఎం కేసీఆర్ అన్నారు. అప్పటి విద్యుత్ పరిస్థితులు భయకరంగా ఉండేవని గుర్తుచేశారు. చివరకు పారిశ్రామికవేత్తలు కూడా ఆందోళనకు దిగిన పరిస్థితులు దాపురించాయన్నారు. అలాంటి పరిస్థితులను అధిగమించేందుకు చాలా కష్టాలు పడ్డామని, ఎవరూ ఊహించని విధంగా ఇప్పుడు నిరంతర విద్యుత్ ఇస్తున్నామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక్కరోజైనా రోజంతా కరంట్ ఇచ్చారా? అప్పుడు ఎందుకు ఇవ్వలేదు? అని ప్రతిపక్షాలను ప్రశ్నించారు. విద్యుత్ సమస్యలను అధిగమించేందుకు ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలుచేస్తే దానిపైనా ఆరోపణలు చేస్తున్నారని సీఎం కేసీఆర్ మండిపడ్డారు.

ప్రగతి సాధిస్తే ప్రతిపక్షాల కాకిగోల
మంచి గ్రోత్‌తో రాష్ట్రం ఉందని, ఈ సమయంలో ప్రతిపక్ష పార్టీలు కాకిగోల చేస్తున్నాయని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. పిచ్చితో పసలేని ఆరోపణలు, భయంకరమైన పద్ధతిలో ఆరోపణలు చేస్తున్నారన్నారు. నీటిపారుదల ప్రాజెక్టుల మీద కోర్టుల్లో కేసులువేసి, స్టేలు తీసుకువస్తున్నారు. రౌండ్‌టేబుల్ అంటూ పనికిమాలిన, దుర్మార్గమైన, మోస్ట్ అన్‌వాంటెడ్‌గా ఏమాత్రం అవగాహన, పరిజ్ఞానం లేకుండా ఇష్టమొచ్చినట్టు అవాకులు, చెవాకులు పేలుతున్నారు అని ప్రతిపక్షాలపై సీఎం ఆగ్రహం వ్యక్తంచేశారు. కొత్త రాష్ట్రమైనప్పటికీ.. ఎదురయ్యే సమస్యలను అధిగమిస్తూ ఈ వృద్ధిరేటు ఎలా సాధిస్తామనే కనీస అవగాహన వారికి లేదన్నారు. ఇంత పెద్ద వృద్ధిరేటును సాధించేందుకు కడుపు కట్టుకుని, క్రమశిక్షణతో పనిచేస్తున్నామని వెల్లడించారు. ఇంత కష్టపడి పనిచేస్తేనే ఈ వృద్ధిరేటు సాధ్యమైందని చెప్పారు. కొత్త రాష్ట్రం అనతికాలంలో 21.96% వృద్ధిరేటు సాధించడమంటే అషామాషీ కాదని స్పష్టంచేశారు.
ఇంత వృద్ధితో ముందుకు పోతున్న రాష్ట్రం మనదేనన్నారు. ఇదేదో ఆషామాషీగా వచ్చిన వృద్ధి కాదు. కేంద్రంలో ఉన్నది మా ప్రభుత్వమేమీ కాదు. కనీసం మా ఫ్రెండ్లీ ప్రభుత్వం కూడా కాదు. వాళ్ల కోటరీలో కూడా మేం లేము. కానీ తెలంగాణ వృద్ధిరేటుపై కేంద్రం తేల్చిన లెక్కలు ఇవి అని సీఎం వివరించారు. రాష్ర్టానికి ఇప్పటికే వివిధరంగాల్లో 40 అవార్డులు వచ్చాయని, హడ్కో, కేంద్రం అవార్డులు, ఇంటర్నేషనల్ అవార్డులు కూడా వచ్చాయని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. మిషన్ భగీరథ పెడితే దానిలో కమీషన్లు అంటున్నారని, మిషన్ కాకతీయ పెడితే దాన్ని కూడా కమీషన్ అంటున్నారని, దద్దమ్మల్లాగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. యాభై ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ఇప్పుడు ఆరోపణలు చేసేవాళ్లంతా పాత్రధారులు. ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా ఉన్నారని కేసీఆర్ గుర్తుచేశారు. కాకతీయ రాజులు నిర్మించిన మైనర్ ఇరిగేషన్ వ్యవస్థ ధ్వంసం అవుతుంటే.. సన్యాసుల్లాగా ఎవరూ నోరు తెరువలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. వాటి మరమ్మతులకు కనీసం నియోజకవర్గ నిధుల నుంచైనా పైసా ఇవ్వలేదన్నారు.

చాలా దుర్మార్గంగా.. క్రిమినల్‌గా వ్యవహరించారని నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రభుత్వం వీటన్నింటినీ సరిదిద్దుతూ.. మంచి పనులు చేస్తుంటే ప్రతిపక్షాలు అవాకులు, చెవాకులు పేలుతున్నాయని మండిపడ్డారు. నోరుంది కదా అని ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్న ప్రతిపక్షాలు.. వాటికి ఆధారాలుంటే నిరూపించాలని సవాల్ విసిరారు. ప్రతి ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ నీటిపారుదలరంగంలో రూ.25 వేల కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. తెలంగాణలో అద్భుతమైన అభివృద్ధి దృశ్యం ఆవిష్కృతమవుతున్నదని చెప్పారు. మొదట్లో అసలు మన ఇంజినీర్లు అందుకోలేరని అనుమానాలు ఉండేవన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చే నాటికి కనీసం సర్వే చేసేందుకు సామగ్రి కూడా లేదు. పది, ఇరవై కోట్లు ఖర్చు పెట్టి సర్వే సామగ్రి కొనుగోలుచేసి ముందుకు సాగాం. సీఎంగా నేను స్వయంగా ప్రాజెక్టులను డిజైన్‌చేసి, రాత్రి 2, 3 గంటల వరకు కూడా వేల సమీక్షలు చేశా అని చెప్పారు. రాష్ట్రంలోని అధికారులు ఎక్కడా చేయని విధంగా మన రాష్ట్రంలో పనిచేశారని, అర్ధరాత్రి కూడా పనులు చేశారని మెచ్చుకున్నారు. గోదావరి, కృష్ణా నదులపై బరాజ్‌లు పకడ్బందీగా నిర్మాణమయ్యేలా పనిచేశారని, అర్ధరాత్రి కూడా సైట్ల మీద ఉండి సమీక్షించారంటూ సీఎం కేసీఆర్ వారిని అభినందించారు.

ఎవరి పీడ వదిలించాలో ప్రజలకు బాగా తెలుసు
రాష్ట్రంలో ఎవరి పీడ వదిలించాలో ప్రజలకు బాగా తెలుసని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. భూకబ్జాలు, కుంభకోణాలు, మంత్రులు, ఐఏఎస్‌లు జైళ్లలో, పేటపేటకు పేకాట క్లబ్బులు, గ్యాంగ్‌స్టర్లు, గల్లీలీడర్లు, గుట్కాలు, మట్కాలు, నకిలీలు, మకిలీలు, బాంబుల మోతలు, కరంటు కోతలు.. ఇవన్నీ 2014కు ముందున్న దృశ్యం. పెండింగ్ ప్రాజెక్టులు కాంగ్రెస్ జమాన. మేం నెట్టెంపాడు, కల్వకుర్తి, బీమా పూర్తి చేశాం. ఒక్క పాలమూరులోనే 9 లక్షల కొత్త ఆయకట్టు ఇచ్చాం. కరంటు కోతలు అరికట్టాం. హైక్వాలిటీ పవర్ సైప్లె చేసిన రాష్ట్రం తెలంగాణ. దేశంలోనే 24 గంటల ఉచిత కరంటు ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ప్రపంచానికి తెలుసు. ఆనాడు కులవృత్తులు కూలాయి. సిరిసిల్లలో ఆత్మహత్యలు. చేనేత సోదరులారా చావకండి.. ఆత్మహత్యలు పరిష్కారం కాదు ఇది సిరిసిల్లలో గోడలపై రాతలు. ఇది 50 ఏండ్ల పాలన ఫలితం. ఆనాడు కల్లుదుకాండ్లు బంద్ అయి చీప్ లిక్కర్లతో లాబీలతో గౌడన్నల నోరు కొట్టారు. పరిశ్రమల మూసివేత, భయంకరమైన అడవుల నరికివేత.. అలా అఘాయిత్యాలు, పూటకో ఎన్‌కౌంటర్, చావులు, రక్తపాతాలు, రాజకీయ అవసరాల కోసం సృష్టించే మతకల్లోలాలు, మారణహోమాలు.. ఈ దరిద్రానికి నెలవు, రిజర్వ్ బ్యాంక్ కాంగ్రెస్ పార్టీ. అందులో ఉండే దరిద్రుల పీడపోవాలి. పోవాల్సింది కేసీఆర్ పీడకాదు. వాళ్లు చెరబట్టిన, నాశనం చేసిన తెలంగాణను విడిపించిన భూమిపుత్రుడు కేసీఆర్. విత్తనాల విలవిలలేదు, పెట్టుబడి కోసం అప్పులు లేవు, పేకాట క్లబ్బులు లేవు, గుడుంబా బట్టీలు, టెర్రరిస్టుల దాడులు లేవు, కర్ఫ్యూలు లేవు.. రాష్ట్రం ప్రశాతంగా ఉన్నది. ఇది ఇట్లనే ఉండాలి. ఎవలి పీడ వదిలించాలో ప్రజలకు బాగా తెలుసు అని వ్యాఖ్యానించారు.

తెలంగాణ ప్రశాంతంగా ఉన్నది
తాను చూసిన 40-45 ఏండ్ల రాజకీయ అనుభవంలో తెలంగాణ ఇప్పుడు ప్రశాంతంగా నిద్రిస్తున్నదని.. ఈ నాలుగున్నరేండ్లలో తెలంగాణ ప్రశాంతంగా ఉన్నదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రం మళ్లీ అవినీతిపరులు, అసమర్థుల చేతికిపోతే.. అవగాహన రాహిత్యంతో ఉన్నవారికి ఇస్తే కుక్కలు చింపిన విస్తరి అయితది. ఇంత పట్టుమీద, ఇంత ముక్కుసూటిగా అభివృద్ధి పనులు జరగవు. ప్రగతి రథచక్రం ఆగిపోవద్దు. ఇది రాష్ట్ర ప్రజలకు నా విజ్ఞప్తి. వాస్తవానికి ఇవి ముందస్తు ఎన్నికలు కావు. ఇప్పటికే ఎన్నికల జోన్‌లోకి వచ్చాం. ప్రస్తుతం నాలుగు రాష్ర్టాల్లో జరుగుతున్నాయి. మిగతావి కూడా అవుతుంటాయి. సాధారణ ఎన్నికలు దూరంగా ఏమీ లేవు. జనవరి నుంచి ప్రక్రియ ప్రారంభం అవుతుంది. గత 20 ఏండ్లుగా నా చరిత్ర, నా పద్ధతి, వ్యవహారం మీ ముందర ఉంది. కేసీఆర్ ఏం చేసినా తెలంగాణ మంచికోసమే చేస్తారే తప్పించి చెడుకోరి చేయడు. వందకు వందశాతం భవిష్యత్ ఉజ్వలంగా ఉండాలనే చేస్తున్నాం.
తెలంగాణకు ఒక్క నొక్కు పడ్డా కేసీఆర్ ఓర్చుకోడు. ఇది ప్రజలకు తెలుసు. మ్యానిఫెస్టోలో పెట్టిన అన్ని అంశాలను అమలు చేశాం. మేనిఫెస్టోలో లేని 76 అంశాలను అమలు చేశాం. వీటికోసం మమ్మల్ని ఎవరూ డిమాండ్ చేయలేదు. కల్యాణలక్ష్మి పథకం పెట్టమని ఎవరూ దరఖాస్తు చేయలేదు. మొదట ఎస్సీ, ఎస్టీలకే పెట్టాలని అనుకున్నాం. తర్వాత బీసీలు, ఓసీల్లోని పేదలకూ వర్తింపజేశాం. రైతుబంధు, రైతుబీమా, భూ రికార్డుల ప్రక్షాళన, బీసీ కులాలకు ఆత్మగౌరవ భవనాలు, బీడీ కార్మికుల పెన్షన్ ఎవరూ కోరలేదు. తెలంగాణ ప్రజల అవసరాల రీత్యా అమలు చేశాం. ఇదే ప్రగతి నివేదన సభలో చెప్పాను. భవిష్యత్‌లో కూడా చెప్తాను. అవన్నీ రైతుల కేంద్ర బిందువుగా ఉన్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. రాష్ట్రంలో పేకాట క్లబ్బులు, గుడుంబా కేంద్రాలు లేవు, ఎరువుల కోసం ఎర్రిచూపులు లేవు, లాఠీచార్జీలు లేవు. అన్ని వర్గాలు, కులాలు, మతాలను ఆదరించిన నేపథ్యంలో మా నాలుగున్నరేండ్ల పాలనలో మత ఘర్షణలు లేవు.

హైదరాబాద్‌లో కర్ఫ్యూ లేదు. సంపుకోవడాలు.. సచ్చుడులేదు. పటిష్ఠమైన లా అండ్ ఆర్డర్‌తో క్రైం రేట్ తగ్గింది. షీటీమ్స్‌తో రక్షణ వచ్చింది. నేను చూసిన 40-45 ఏండ్ల రాజకీయ అనుభవంలో తెలంగాణ ఇప్పుడు ప్రశాంతంగా నిద్రిస్తున్నది. రాష్ర్టానికి ఎందరో వచ్చి నేర్చుకొని పోతున్నారు. నిన్న అస్సాం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వచ్చారు. కాళేశ్వరం గురించి ఎంతో నేర్చుకున్నామని, మా ఇంజినీర్లకు నేర్పండి అని సీడబ్ల్యూసీ చీఫ్ ఇంజినీర్ వారు కోరారు. కొత్త రాష్ట్రం అయినప్పటికీ పకడ్బందీగా, పద్ధతిగా నడువడం వల్ల పేదలు, ప్రజలు ఆశావహ దృక్పథంతో ముందుకు సాగుతున్నారు. పాలమూరు జిల్లాలో 9 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు తెచ్చాం. మెదక్ నారాయణ్‌ఖేడ్ వారు, పాలమూరు నుంచి వలస వచ్చిన వారు హైదరాబాద్‌లో రేషన్ కార్డులు వాపస్ చేసి మాకు ఇక్కడే ఇవ్వాలన్నారు. ఇది మన కండ్ల ముందే జరిగింది. కానీ వీటిని విస్మరించి అడ్డగోలుగా మాట్లాడుతున్నారు అని పేర్కొన్నారు.

బాధ్యతారాహిత్యంగా మాట్లాడితే ఎలా?
100 యూనిట్ల వరకు విద్యుత్‌పై సీఎం కేసీఆర్ స్పష్టత ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ సోదరులు కొన్ని నెలల కిందట నన్ను కలిశారు. 50 యూనిట్లకు పైబడినా మా దగ్గర వసూలు చేస్తున్నారు వంద వరకు ఇవ్వాలంటే.. మొన్ననే జీవో విడుదల చేశాం. ఇది మా విధానం అని చెప్పారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాల హామీలపై సీఎం కేసీఆర్ మండిపడ్డారు. కేసీఆర్ వంద అంటే.. మేం రెండు వందలు.. వెయ్యి అంటే 2020.. కేసీఆర్ 6 కిలోల బియ్యం అంటే మేం ఏడు కిలోలు.. ఇంత సిల్లీగా, బాధ్యతారాహిత్యంగా మాటలు. ప్రజలు ఏమనుకుంటారనే ఆలోచన వద్దా. అప్పుడు 4 కిలోలు ఇచ్చింది ప్రజలు మర్చిపోయారా? వెయ్యి పింఛన్ ఆలోచన మీకు 50 ఏండ్లలో ఎప్పుడైనా వచ్చిందా? చచ్చిపోతుంటే బీమా ఇవ్వాలని మీ జీవితంలో అనుకోలేదు. వాళ్లు అధికారంలోకి వస్తే పింఛన్ మహా అంటే 250 చేసేవాళ్లేమో. అంతేతప్ప వాళ్ల జన్మలో కూడా వెయ్యి ఇవ్వకపోదురు. కాంగ్రెస్‌ను 2000 పింఛన్ ప్రకటించే స్థాయికి తెచ్చింది ఎవరు? కేసీఆర్. అది మీ విజయం కాదు.. కేసీఆర్ విజయం. కాబట్టి ఇలా అవాకులు చెవాకులు కాదు. చాక్లెట్ల పంచాయతీలాగా మాటలు.
ఇది ఆరోగ్యకరమైన పోటా? మేం సంక్షేమం మాత్రమే చేయలేదు. ఆనాడు జీవన విధ్వంసం భరించరాని విధంగా ఉన్నది. చేనేతల ఆత్మహత్యలు, వృత్తులవారి ఆత్మహత్యలతో భయంకరంగా ఉన్నది. హత్యలు జరిగాయి. దుర్మార్గాలతో ప్రజలు ఉండలేని స్థితి. అలాంటి తెలంగాణ మా చేతికి వచ్చినపుడు వాటిని తొలిగించేందుకు మేం అనేక సంక్షేమాలు తెచ్చాం. ప్రజల్లో ధైర్యం నింపాం. తినగలుగుతాం.. ఉండగలం అనే ధీమా తెచ్చాం. సంపద పెరుగుతున్నట్టే వరుసగా కార్యక్రమాలు తెచ్చాం. ఇప్పుడు కూడా సంపద పెంచడం.. పేదలకు పంచడం మా సిద్ధాంతం. ఎన్నికల తాయిలాలు కాదు. ప్రభుత్వం వచ్చిన మొదటి క్యాబినెట్‌లోనే 42 నిర్ణయాలు మా చిత్తశుద్ధికి నిదర్శనం. అవి ప్రజల ముందున్నాయి. ప్రజలకు వాస్తవం.. అవాస్తవం తెలుసు. ప్రజల కోసం ఎన్నో చేసింది. ఇప్పటికీ తనకున్న 5-6 నెలల కాలాన్ని త్యాగం చేసింది. ఇదంతా రాష్ట్ర ప్రయోజనాల కోసమే. రాష్ట్ర వృద్ధి దెబ్బతినవద్దు. నోరు ఫినాయిల్‌తో కడిగేంత దుర్మార్గం వదిలేయాలి. రండి.. క్షేత్రస్థాయికి వెళ్దాం. ఒకాయనను అడిగితే.. అర్ధరాత్రి అయినా ఎన్నికలకు రెడీ అన్నారు. నిజంగా ఎన్నికలు రాగానే గాబర అవుతున్నారు. ఎందుకు ముందస్తో ప్రజలకు చెప్పాలని జానారెడ్డి అంటడు. ఎందుకు ఇదని ఇంకొకాయన అంటడు. నేనేమంటానంటే.. తెలంగాణ ప్రజల్లోకి పోదాం. తేల్చుకుందాం. ప్రజలు ఎవరికి తీర్పు, అవకాశం ఇస్తే.. వారికే. మేం అభ్యర్థులను ప్రకటించాం అని చెప్పారు.