తెలంగాణ కాంగ్రెస్ లో చిచ్చు రేపుతున్న సీఎల్పీ

తెలంగాణ కాంగ్రెస్ లో చిచ్చు రేపుతున్న సీఎల్పీ

తెలంగాణ కాంగ్రెస్ కి కష్టం వచ్చిపడింది. మొన్ననే ఎన్నికల్లో చావుతప్పి కన్ను లొట్టపోయినప్పటికీ పార్టీనేతల తీరులో మార్పు రాకపోవడంతో ఈ దుస్థితి దాపురించింది. ఇంతకీ అంత పెద్ద కష్టం ఏమిటి అనుకుంటే ఆశ్చర్య పోక తప్పదు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు రంగం సిద్ధం అవుతుంటే కాంగ్రెస్ అధిష్టానం గుండెల్లో మాత్రం రైళ్ళు పరిగెడుతున్నాయి. దీనికి కారణం సీఎల్పీ పదవికి పోటాపోటీగా నేతలు సిద్ధం కావడం ఒకటైతే తమకు ఆ పోస్ట్ ఇవ్వకపోతే, రాకపోతే గులాబీ కారు ఎక్కేందుకు సిద్ధం అవుతున్నారన్న ప్రచారం కాంగీయుల్లో ఆందోళన పెరిగిపోవడానికి కారణం కావడం గమనార్హం.ప్రస్తుతం సిఎల్పీ రేసులో సీనియర్ నేత భట్టి విక్రమార్క ముందు వరసలో వున్నారు. ఆ వెనుకే సబితా ఇంద్ర రెడ్డి సిద్ధమయ్యారు. తన కుమారుడు కార్తీక్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు కోసం ఆందోళన చెందుతున్న సబిత అధిష్టానం సరైన గుర్తింపు ఇవ్వకపోతే అవసరమైతే గులాబీ పార్టీకి జై కొట్టేస్తారన్న ప్రచారం సాగుతుంది. వారి సంగతి అలా ఉంచితే కోమటి రెడ్డి రాజగోపాల్ అయితే ఇప్పటికే ఎమ్యెల్యేల మద్దతు కూడగడుతూ స్పీడ్ మీద వున్నారు.

ఇలా ఎవరికి వారు తమ ప్రయత్నాలు జోరుగా సాగిస్తున్నారు. కొందరు కాంగ్రెస్ ఎమ్యెల్యేలు ఐదేళ్ళు అధికారం కి దూరంగా వుండటంకన్నా అధికారపార్టీలో చేరితే మంచి పదవులు సైతం దక్కించుకోవచ్చనే యోచన చేస్తున్నారన్న సమాచారం హస్తం పార్టీని కలవరపరుస్తోంది. వీరిని బుజ్జగించడంతో పాటు సిఎల్పీ వ్యవహారాన్ని స్మూత్ గా డీల్ చేయమని ఏఐసిసి ఇంచార్జ్ వేణుగోపాల్ పై బాధ్యతలు మోపింది. అయితే ఆయన మాట డక్కా మొక్కీలు తిన్న టి కాంగ్రెస్ నేతలు ఏ మేరకు వింటారన్నది సందేహమే. రాబోయే నాలుగు రోజులు టి కాంగ్రెస్ కి గడ్డు రోజులే అని ఆ పార్టీ వారే గుసగుసలు ఆడుకోవడం గమనిస్తే గందరగోళం అయోమయం హస్తాన్ని ఇంకా వీడలేదని తేలుతుంది.