lv subramanyam

తిరుమ‌ల శ్రీ‌వారికి చెందిన 1381 కిలోల బంగారంపై స‌మ‌గ్ర విచార‌ణ జ‌ర‌పాలి: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎల్ వి సుబ్ర‌హ్మ‌ణ్యం

Share This

తమిళ‌నాడులోని తిరువ‌ళ్లూరు జిల్లా ఆవ‌డి స‌మీపంలో వేంప‌ట్టు చెక్‌పోస్టు వ‌ద్ద అనుమానాస్ప‌ద ప‌రిస్థితిలో దొరికిన తిరుమ‌ల శ్రీ‌వారికి చెందిన 1381 కిలోల బంగారంపై స‌మ‌గ్ర విచార‌ణ జ‌ర‌పాల‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎల్ వి సుబ్ర‌హ్మ‌ణ్యం ఆదేశించారు. రెవెన్యూ ఎండోమెంట్స్ శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఈ విచార‌ణ జ‌రిపి ఈ నెల 23 లోపు నివేదిక స‌మ‌ర్పించాల‌ని ఆయ‌న ఆదేశాలు జారీ చేశారు. ఏప్రిల్ 17 వ తేదీన ఈ బంగారం దొరికిన విష‌యం తెలిసిందే. టిటిడి విజిలెన్స్ వింగ్ పాత్ర ఏమిటో కూడా ఇందులో ద‌ర్యాప్తు చేస్తారు. ఎలాంటి ర‌క్ష‌ణ లేకుండా అంత పెద్ద మొత్తంలో బంగారాన్ని ఎలా ఒక చోట నుంచి మ‌రొక చోట‌కు త‌ర‌లిస్తారు అనేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. అంతేకాకుండా స‌రైన ప‌త్రాలు లేకుండా బంగారం త‌ర‌లించాల్సిన అవ‌స‌రం ఏమిట‌నేది మరొక ప్ర‌ధాన ప్ర‌శ్న‌. చెన్నైలోని ఒక బ్యాంకు నుంచి తిరుమ‌ల తిరుప‌తి వేంక‌టేశ్వ‌ర‌స్వామి బంగారాన్ని ఎందుకు త‌ర‌లిస్తున్నారు? ఎవ‌రి వ‌ద్ద‌కు త‌ర‌లిస్తున్నారు. అంత పెద్ద మొత్తంలో బంగారం ఎలాంటి ప‌త్రాలు లేకుండా స‌రైన ర‌క్ష‌ణ లేకుండా ఎందుకు త‌ర‌లిస్తున్నారు అనే విష‌యాలు ఈ విచార‌ణ‌లో తేలాల్సి ఉంటుంది. తమిళనాడులో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో పోలీసులు అన్ని వాహ‌నాలు త‌నిఖీ చేస్తున్నారు కాబ‌ట్టి ఈ బంగారం దొరికింది కానీ అలా కాక‌పోయిన‌ట్ల‌యితే ఈ 1380 కిలోల బంగారం ఏ పెద్ద మ‌నిషి చేతికి చిక్కి ఉండేది అనేది పెద్ద ప్ర‌శ్న‌.

ఇంత బంగారం చూసి పోలీసులే షాకయ్యారు

ప‌ట్టుకున్న పోలీసులే ఇదంతా టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం)కి చెందినది అని తెలియ‌డంతో ఈసీ అధికారులతో బాటు షాకయ్యారు.బంగారాన్ని తరలిస్తున్న వాహనాల్లో ఎటువంటి ఆధారాలు లేకపోవటంతో ఆ బంగారాన్ని తమిళనాడులోని పూందమల్లి తహసీల్దార్‌ కార్యాలయానికి తరలించారు. ఈ క్రమంలో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు అధికారులు ఏప్రిల్ 18న ఈసీ అధికారులను కలిసి నగలకు సంబంధించిన ఆధారాలు చూపించారు. ఈ త‌ర్వాత‌ ఈ బంగారాన్నిఏప్రిల్ 19న టీటీడీ ఖజానాకు జమచేస్తామని పీఎన్‌బీ అధికారులు సమాచారం ఇచ్చారు. దీంతో టీటీడీ ఖజానాకు ఈ బంగారం చేరింది. ఇది జరిగిన త‌ర్వాత టీటీడీ చైర్మన్‌ కానీ, ఈవో కానీ, ఇతర అధికారులు కానీ ఆ బంగారం గురించి నోరు మెదపలేదు. దీనిపై చాలా మందికి అనుమానాలు ఉన్నా కూడా ఎవ‌రూ మాట్లాడ‌టం లేదు. స్వామివారి విష‌యంలో ఆయ‌నే జాగ్ర‌త్త‌లు తీసుకుంటారులే అని ఆధ్యాత్మిక స్వాములు మాట్లాడ‌కుండా ఉన్నారు. ఎవ‌రి పాపాన వారే పోతారులే అని భ‌క్తులు మిన్న‌కున్నారు. ఎన్నిక‌ల హ‌డావుడిలో ప‌డి రాజ‌కీయ నాయ‌కులు ఈ అంశాన్ని ప‌ట్టించుకోలేదు. చివ‌ర‌కు నిబంధ‌న‌ల ప్ర‌కారం ద‌ర్యాప్తు జ‌రిపించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నిర్ణ‌యించారు. ఆయ‌న నిర్ణ‌యం పై భ‌క్తులు ఎంతో ఆనందం, హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.